మరింత మెజారిటీతో రెండో సారి అధికారంలోకి వస్తాం

2014 లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన దానికంటే ఎక్కువ మెజారిటీతో 2019లో రెండో సారి అధికారంలోకి వస్తామని  బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మోదీ వర్సెస్ ఇతర అన్ని పార్టీలుగా 2019 ఎన్నికలు జరుగుతాయని అమిత్ షా జోస్యం చెప్పారు . ఢిల్లీలోని రామలీలా మైదానంలో ప్రారంభమైన బీజేపీ రెండు రోజుల జాతీయ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయం సాధించి, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతారని భరోసా వ్యక్తం చేశారు. 

మోదీ నాయకత్వంలో మనకు ఇంత వరకు ఓటమి కలుగలేదని గుర్తు చేశారు. ఇక మీదట కూడా కలుగదని అమిత్ షా ధీమాగా అన్నారు. మోదీ అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వానిన నడిపించారని కొనియాడుతూ 22 కోట్ల మంది బీద ప్రజల బలం బీజేపీకి ఉన్నదని ఆయన భరోసా వ్యక్తం చేశారు.  ఈ ఎన్నికలు రెండు ఆలోచనా పద్ధతులు, రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరాటంగా అభివర్ణిస్తూ  దేశాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న ఎన్‌డీఏ ఈ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

మోదీని మరోసారి ప్రధాన మంత్రి చేయాలనే సంకల్పంతో మనమంతా ముందుకు సాగాలని ఆయన సమావేశానికి దేశం నలుమూలల నుండి వచ్చిన 12 ల మంది పార్టీ నాయకులకు పిలుపు ఇచ్చారు.  ఆయోధ్యలో రామమందిరాన్ని నిర్మించి తీరుతామని అమిత్ షా ఈ సందర్భంగా  ప్రకటించారు. ఈ నిర్మాణం వీలున్నంత త్వరగా జరగాలని అభిలాషను వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అన్ని విధాల ప్రయోత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ కోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ తన అభిప్రాయం స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు.

 ఉన్నత వర్గాలలోని బీద ప్రజలకు ఉద్యోగాలు, ఉన్నత విద్యారంగంలో పది శాతం రిజర్వేషన్లు కల్పించటం ద్వారా మోదీ ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది యువత ఆశలు, ఆశయాలకు ప్రాణం పోసిందని అమిత్ షా కొనియాడారు. వస్తు, సేవా పన్నులను (జిఎస్‌టీ) సరళీకృతం చేయటం ద్వారా ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యాపార రంగంలో విప్లవం తెస్తోందని ప్రకటించారు. చిన్న వ్యాపారస్తులు, చిన్న పారిశ్రామికవేత్తలకు ఇప్పుడు ఎంతో ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. 

2019 లోక్‌సభ ఎన్నికలు బీజేపీతో పాటు దేశంలోని కోట్లాది మంది ప్రజానీకానికి కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు. దేశంలోని బీద ప్రజలు అభివృద్ధి చెందాలంటే మోదీ మరోసారి ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీలేని వారంతా మహా కూటమిగా ఏర్పడుతున్నరని అమిత్ షా ఎద్దేవా చేశారు. మోదీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో మహా కూటమి పని చేస్తోందని ఆరోపించారు. ఎన్‌డీఏ కూటమి నాయకుడు మోదీ అనేది అందరికీ తెలుసునని, మరి మహా కూటమి నాయకుడు ఎవరని అమిత్ షా ప్రశ్నించారు. 

2019 లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్తుపై, భావి తరాలపై పెద్ద ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 17వ శతాబ్దంలో శివాజీ మహారాష్ట్ర నాయకత్వంలో స్వాతంత్ర పోరాటం ప్రారంభమై ఎన్నో ప్రాంతాలను గెలుచుకోటం జరిగిందని, అయితే అబ్దాలీ, సదాశివ్‌భావ్ మధ్య జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠా సైన్యాలు ఓడిపోయాయని గుర్తు చేశారు. ఈ ఓటమి మూలంగా దేశం దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు పరాయి పాలనలో బానిసలుగా బతకవలసి వచ్చిందని అమిత్ షా  పేర్కొన్నారు. 

2019 ఎన్నికలు కూడా ఇలాంటివేనని, ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీజేపీకేగాక దేశానికి కూడా తీవ్ర నష్ట వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ 30 సంవత్సరాల తరువాత 2014లో మోదీ నాయకత్వంలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. 16 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉందని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాల బలంతో మనం లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని అమిత్ షా ప్రకటించారు.

 పదకొండు కోట్ల మంది సభ్యులున్న బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు భారత దేశం అభివృద్ధి, పార్టీ విస్తరణతో ముడిపడి ఉన్నదని తెలిపారు. మోదీ మరోసారి ప్రధాన మంత్రి అయితే కేరళ వరకు బీజేపీ పతాకం ఎగురుతుందని అమిత్ షా ప్రకటించారు.  దేశ ప్రజలు మోదీ వెంట ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. దేశం కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత నాయకుడు మోదీయేనని అమిత్ షా వ్యాఖ్యానించారు. 

మహా కూటమి పేరుతో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అంటూ  ‘మహా కూటమి ఒక మోసం.. ఇదొక భ్రమ.. దీనికి జాతీయ గుర్తింపు లేదు’ అని ఆయన దుయ్యబట్టారు. 2014లో మన చేతిలో ఓడిపోయిన వారంతా ఇప్పుడు మళ్లీ ఏకమవుతున్నారని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్, మాయావతి ఒకటైనంత మాత్రాన ఏమీ కాదని, అక్కడ మెజారిటీ లోక్‌సభ సీట్లు మనమే గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పరం కొట్లాడుకునే వారంతా ఇప్పుడు కలుస్తున్నారని, మోదీని ఓడించడమే వీరి ఏకైక లక్ష్యమని చెప్పారు. 

ఒంటరిగా పోటీ చేస్తే మోదీని ఓడించలేమనే వారంతా కలుస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్ మిగతా వారుగా ఎన్నికలు జరిగేవని, ఇప్పుడు మోదీ వర్సెస్ మిగతా అందరుగా పరిస్థితి మారిందని చెప్పారు. ఒకే పార్టీ 55 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిదని, కానీ దేశానికి ఏమీ చేయలేదని ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం కోట్లాది మందికి మరుగుదొడ్లు, వంట గ్యాస్, విద్యుత్తు, స్వంత ఇంటిని కల్పించిందని అమిత్ షా చెప్పారు.

 ఆయుష్మాన్ భవ పథకం ద్వారా యాభై కోట్లమందికి ఐదు లక్షల వైద్య సౌకర్యం అందజేశారని ఆయన తెలిపారు. అమెరికా, ఇజ్రాయిల్ మాత్రమే తమ సైనికులపై జరిగే దాడికి ప్రతీకారం తీర్చుకునేవని, మోదీ నాయకత్వంలో పాక్ అక్రమిత కాశ్మీర్‌లో, ఆ సైనిక స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడి చేసి ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరగలేదని సుప్రీం కోర్టు చెప్పినా కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. బీజేపీ ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు.