రిజర్వేషన్ల బిల్లుతో లోలోపల రగిలిపోతున్న కాంగ్రెస్

ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగం ప్రాథమిక ఆకృతిని ఉల్లంఘించడం ఎంతమాత్రం కాదని, సాధారణ కేటగిరిలో వారికి రిజర్వేషన్లు కల్పించి గుర్తించడం గొప్ప నిర్ణయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ పైకి మద్దతు తెలిపినా లోలోపల మాత్రం రగిలిపోతూనే ఉందని ఆయన ఫేస్‌బుక్‌లోని బ్లాగ్‌లో ఎద్దేవా చేశారు. 

వాస్తవానికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందరికీ సమాన న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ రాజ్యాంగాన్ని పొందుపర్చారని ఆయన తెలిపారు. అయితే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి, ఇతర కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ మరికొన్ని వర్గాలకు సమాజంలో రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు.  రిజర్వేషన్ల శాతం ఎట్టిపరిస్థితుల్లో 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్నందున తాము అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చెల్లదని కొన్నివర్గాలు వాదిస్తున్నాయని ఆయన  కొట్టిపారవేసారు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం కేవలం కులం ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు మాత్రమే 50 శాతాన్ని మించరాదని ఇందిరాసాహ్ని కేసులో సుప్రీం స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు తాము ప్రకటించిన పది శాతం రిజర్వేషన్ ఆర్థికంగా వెనుకబడిన వారిని ఉద్దేశించింది కనుక అది తమకు వర్తించదని జైట్లీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణబిల్లుకు పైకి మద్దతు పలికినా, దీనిలోని లోపాలను వెతుకుతూ అడ్డుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 

బీజేపీ ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క శాతం పన్ను కూడా పెంచలేదని, జీఎస్టీ శ్లాబ్‌ను సైతం పలు రకాల వస్తువులకు గణనీయంగా తగ్గించామని జైట్లీ చెప్పారు. అలాగే ప్రజలకు ఆదాయపు పన్ను తగ్గించి వెసులుబాటు కల్పించామని తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో రెండు లక్షల కోట్ల రూపాయల రాయితీ ఇచ్చామని పేర్కొన్నారు. ఆదాయాన్ని త్యాగం చేసి పలు వస్తువుల ధరలను తగ్గించామని ఆయన చెప్పారు. 

పేదలకు సాధికారిత కల్పించడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని జైట్లీ స్పష్టం చేశారు. వారి కొనుగోలు శక్తి పెరగడంతో అది ఆర్థికరంగంపై సానుకూలంగా చూపి దాని వృద్ధి రేటు కూడా పెరుగుతోందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతోందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.