కాంగ్రెస్ పై రూ.5 వేల కోట్ల పరువు నష్టం దావా

రాఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో కాంగ్రెస్‌కు అనిల్ అంబానీ షాకిచ్చారు. ఆ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్‌పై రూ.5 వేల కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ డీల్‌కు సంబంధించి ఆ పత్రిక రాసిన కథనంపై అంబానీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ఈ ఒప్పందంపై నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని కాంగ్రెస్‌ను హెచ్చరించిన ఆయన. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కూడా లేఖ రాసిన విషయం తెలిసిందే.

నేషనల్ హెరాల్డ్ కథనం పూర్తిగా అసత్యాలతో, అమర్యాదపూర్వకంగా ఉన్నదంటూ ఆ పత్రికపై అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీస్ రెండు దావాలు వేసింది. ఒకటి పత్రిక పబ్లిషర్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌తోపాటు ఆ పత్రిక ఎడిటర్, ఆర్టికల్ రాసిన జర్నలిస్ట్‌పై వేశారు. ఇక రూ.5 వేల కోట్ల పరిహారం డిమాండ్ చేస్తూ మరొక దావాను గుజరాత్ కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్ పైన కుడా వేయడం విశేషం.

మోదీ రాఫెల్ డీల్‌ను ప్రకటించే పది రోజుల ముందే అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీని ప్రారంభించారని ఆ పత్రిక కథనం ఆరోపించింది. రాఫెల్ జెట్స్‌ను తయారు చేసే డసాల్ట్ ఏవియేషన్‌తో కలిసి రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ చేపట్టనుంది. ఫ్రాన్స్ నుంచి ఇండియా 36 రాఫెల్ జెట్స్‌ను కొనుగోలు చేయాలని ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ జాయింట్ వెంచర్‌లో పది కోట్ల యూరోల పెట్టుబడి పెట్టడానికి డసాల్ట్ ఏవియేషన్ ముందుకు వచ్చింది.

అయితే ఈ విమానాలను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించడంతోపాటు అనిల్ అంబానీ సంస్థ, డీఏ మధ్య ఉన్న జాయింట్ వెంచర్‌ను కూడా కాంగ్రెస్ పదేపదే ప్రశ్నిస్తున్నది. దీనిపై అనిల్ అంబానీ తీవ్రంగా మండిపడ్డారు. తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆయన విమర్శించారు.