వాళ్లెందుకు రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదు


 కాంగ్రెస్‌కు చెందిన అందరు ప్రధాన మంత్రులూ అగ్ర సామాజిక వర్గాలకు చెందిన వారేనని, ఒక్క మన్మోహన్‌సింగ్‌ సామాజిక వర్గం మాత్రం తనకు తెలియదని కేంద్ర మంత్రి, లోక్‌ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు రాం విలాస్‌ పాశవాన్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రధాన మంత్రులంతా ఎందుకు అగ్రవర్ణ రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదని ప్రశ్నించారు. 

ఉన్నత సామాజికవర్గాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేసిన 124వ రాజ్యాంగ సవరణపై విలేకరులు వివరణ కోరగా.. ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘ఒక్క మన్మోహన్‌ సింగ్‌ మినహా కాంగ్రెస్‌ హాయాంలో పనిచేసిన అందరు ప్రధాన మంత్రుల సామాజిక వర్గాలు నాకు తెలుసు. వారంతా అగ్రవర్ణాల వారే. మరి వారెందుకు పేదలకు రిజర్వేషన్ల గురించి ఆలోచించలేదు? ఒక్క మన్మోహన్‌ సింగ్‌ సామాజిక వర్గం మాత్రం నాకు తెలియదు’’ అని అన్నారు.

విద్య, ఉద్యోగ నియామకాల్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. బిల్లు తర్వాత రాష్ట్రపతి సంతకానికి వెళ్లనుంది.

ఇది చట్టంగా మారితే దేశంలో రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. కానీ రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.