`యన్‌.టి.ఆర్‌’తో చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్‌ మూవీ ‘యన్‌.టి.ఆర్ కథానాయకుడు’‌ మొదటి భాగం విడుదల ఒక విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నిరాశ కలిగిస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికలలో తనకు, తన కుమారుడు లోకేష్ కు ప్రచారం కోసం ఉపయోగ పడుతుందనే ఈ చిత్ర నిర్మాణానికి ఆయన ప్రోత్సహించినట్లు చెప్పుకొంటున్నారు. అయితే ఈ ప్రయోజనం ఏ మాత్రం నెరవేరుతుందో చెప్పలేని పరిస్థితులలో ఉన్నారు. 

ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ లక్ష్మి పార్వతి కధాంశంగా మరో చిత్రం తీయడంతో తీవ్రమైన ప్రతికూల ప్రచారానికి ఆ సినిమా ఉపయోగ పడే అవకాశం ఏర్పడింది. ఈ సినిమాలో కూడా స్వర్గీయ యన్‌.టి.రామారావు  జీవితంలో అందరికి తెలియని అద్భుతమైన విశేషాలను తెలియచెప్పే ప్రయత్నం చేయకుండా ఆయన పోషించిన అనేక పాత్రలలో బాలకృష్ణను చూపించే ప్రయత్నం ఎక్కువగా జరగడంతో  చూసే వారికి సహితం విసుగు కలిగించినట్లు చెబుతున్నారు. 

ఈ సినిమాతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో వెలితి ఉందన్నట్టుగా భావిస్తున్నారు. సినిమాలో నందమూరి తారక రామారావు బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు లేకపోవటం.. తొలిసారి ఎన్టీఆర్‌, ఎల్వీ ప్రసాద్‌లు ఎక్కడ కలిసారు.. ఎల్వీ ప్రసాద్‌ ఎందుకు ఎన్టీఆర్‌కు సినిమా అవకాశం ఇస్మన్నారు ... వంటి విషయాలు చూపించకపోవటం లాంటివి కథ అసంపూర్తిగా విన్న భావన కలిగిస్తాయి. ఎన్టీఆర్‌ యువకుడిగా కనిపించే సీన్స్‌లో బాలయ్య లుక్‌పై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు.

సెకండ్‌ హాఫ్‌లోనూ అలాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడుల పరిచయం, ఎన్టీఆర్‌ తన కుమార్తెను చంద్రబాబు నాయుడికి ఇచ్చి వివాహం చేయటం లాంటి కీలకమైన సంఘటనలకు కూడా సినిమాలో చోటివ్వలేదు. ఎక్కువగా బాలకృష్ణను వివిధ గెటప్‌లలో చూపించేందుకే సమయం కేటాయించారు. 

సీతా రామ కళ్యాణం సినిమాలో రావణాసురుడిని దశకంఠుడిగా చూపించేందుకు ఏకంగా 20 గంటల పాటు రెప్ప కూడా వేయకుండా ఎన్టీఆర్ ఒకే స్టిల్‌లో నిలబడ్డట్టుగా చూపించటం అంత నమ్మశక్యంగా అనిపించదు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఫెయిల్యూర్స్‌ను పక్కన పెట్టేయటంతో డ్రామా మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది.

ఇక దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ అనర్గళంగా చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌ను బాలయ్య చెప్పకుండా కేవలం ఎన్టీఆర్ వాయిస్‌కు యాక్ట్ చేయటం కూడా అభిమానులను నిరాశపరిచే అంశమే.

అందరూ ఈ మధ్యనే వచ్చిన సావిత్రి బయోపిక్ తో పోల్చి చూస్తున్నప్పుడు ఈ సినిమా నిరుత్సాహాన్ని కలిగిస్తున్నది. ఈ సినిమా కధనంలో కనిపించిన ప్రావీణ్యత ఇక్కడ కనిపించనే లేదు. ఈ చిత్రం చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం ఉపయోగ పడక పోగా కొత్తగా ఆయన కాంగ్రెస్ తో ప్రారంభించిన స్నేహం ప్రజలలో వెగటు కలిగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 

కాంగ్రెస్ వాదిగా రాజకీయ జీవితం ప్రారంభించి, బద్ద కాంగ్రెస్ వ్యతిరేకత అజెండాగా మామ ఎన్ టి ఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి, ఆ పార్టీని హస్తగతం చేసుకున్న ఆయన ఇప్పుడు తిరిగి రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకోవడాన్ని `స్వగృహ ప్రవేశం'గా టిడిపి మంత్రులే పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఈ విషయమై ఎన్ టి ఆర్ హయాం నుండి తెలుగు దేశంలో ఉన్న నేతలు, కార్యకర్తలు తమాయించుకోలేక పోతున్నారు. 

పుండుమీద కారం చల్లిన రీతిలో ఈ సినిమాలో కాంగ్రెస్ పై పదునైన డైలాగ్ లను బాలకృష్ణ సంధించడం కొత్తగా కాంగ్రెస్ తో కాపురం చేస్తున్న చంద్రబాబును ఇరకాటంలో పడవేస్తున్నది.  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటిస్తుంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డులు అందుకునేందుకు వెళ్లిన ఎన్టీఆర్, నాగేశ్వరరావులను మదరాసీలుగా సంభోదిస్తారు. దీంతో ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ముందే తీవ్ర స్వరంతో తాము మదరాసీలం కాదని..ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని గట్టిగా మాట్లాడతారు. నాగేశ్వరరావు కూడా ఆయనకు జత కలుస్తారు.  ఆ సమయంలో ఇందిర చిన్నబుచ్చుకుంటారు కూడా.

ఎన్టీఆర్ తన సినిమాలో ఎమర్జెన్సీ  సమయంలో ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ చేసిన అరాచకాలు కొన్నింటిని సినిమాలో పెట్టాలని దర్శకులకు సూచిస్తారు. ముఖ్యంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. వాస్తవానికి ఎన్టీఆర్ ఏకంగా ప్రధానిపైనే  (ఇందిరాగాంధీ)పైనే వ్యంగాస్త్రాలు సంధించాలని కోరారని..తామే ఆమె కొడుకు వరకే దాన్ని పరిమితం చేశామని డైలాగ్ కూడా సినిమాలో ఉంది. అంటే ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలా పోరాడింది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. కానీ అదే ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్త్ మేరా దోస్త్ అంటూ ముందుకు సాగుతోంది. మరి చంద్రబాబు ఒకటి చేస్తుంటే..ఆయన బావమరిది..వియ్యంకుడు బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా కాంగ్రెస్ పై ఎటాక్ చేయడం టిడిపి వర్గాలలో కలకలం రేపుతున్నది.