ఎన్‌ఐఏ అదుపులో కోడికత్తి నిందితుడు

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి కేసులో నిందితుడైన  జనుపల్లి శ్రీనివాసరావును అడవివరం జైలు నుంచి ఎన్‌ఐఏ అధికారులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి దాటిన తర్వాత ఒక సుమో వాహనంలో విశాఖ నుంచి విజయవాడకు తరలించారు. శుక్రవారం  ఉదయం విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. మొత్తం 107 రోజుల పాటు విశాఖలో ఈ కేస్ విచారణ జరిగింది. ఇకపై ఈ కేసు దర్యాప్తు విజయవాడలో కొనసాగుతుంది.

శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ను విశాఖ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు గురువారం డిస్మిస్‌ చేసింది. ఈ నెల 9న శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు ఈ నెల 4న ఎన్‌ఐఏకు బదిలీ అయినందున ఎన్‌ఐఏ పీపీకి నోటీసు ఇవ్వాలని ఈ సందర్భంగా న్యాయవాది అబ్దుల్‌ సలీమ్‌ ను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు గురువారం సలీమ్, ఎన్‌ఐఏ పీపీ సిద్దరాములుకు నోటీస్‌ అందజేసి, దానిని కోర్టువారికి అందజేశారు.

ఈ మేరకు మేజిస్ట్రేట్‌ ఎన్‌ఐఏ పీపీ ని వివరణ కోరగా.. ఆయన కేసుకు రికార్డుల నిమిత్తం 3వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మెమో దాఖలు చేసినట్లు తెలిపారు. ఇంకా రికార్డులు ఏపీ పోలీసుల నుండి తమకు చేరలేదని విన్నవించారు. దీంతో న్యాయమూర్తి కేసు ఎన్‌ఐఏకి బదిలీ చేసినందున కోర్టు పరిధిలోకి రాదని తెలియజేశారు. న్యాయవాది సలీమ్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేశారు.

కాగా ఎన్‌ఐఏ అధికారులు ఈ నెల 7న కేసు రికార్డులు తమకు అప్పగించాలని కోర్టులో మెమో దాఖలు చేశారు. జనవరి 1న ఎఫ్‌ఐఆర్‌ నమోదైనందన రికార్డులు అప్పగించాలని కోరారు. ఈ మేరకు న్యాయమూర్తి గురువారం సాయంత్రం కేసు రికార్డులను ఎన్‌ఐఏ అప్పగించే నిమిత్తం విజయవాడకు తరలించారు.  

నిందితుడు శ్రీనివాస్‌ రిమాండ్‌ శుక్రవారం వరకు ఉండటంతో గురువారం సాయంత్రం నిందితుడిని ఎన్‌ఐఏకు అప్పగిస్తూ వారెంట్‌ జారీ చేశారు.