కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని నీటి పారుదలు, మంచినీటి పథకాలకు అందజేసిన ఆర్థిక సహాయంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తనతో బహిరంగ చర్చకు రావాలని బీజేపీ లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సవాల్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు, మంచినీటి పథకాలకు కేంద్రం పెద్దఎత్తున నిధులిస్తుంటే కేటీఆర్, ఇతర నాయకులు మాత్రం ఒక్క రూపాయల కూడా ఇవ్వలేదని చెప్పటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద తెలంగాణకు వేలకోట్ల రూపాయలను అందజేసిందని దత్తాత్రేయ చెప్పారు. చంద్రశేఖరరావు లేదా తారకరామారావు తనతో బహిరంగ చర్చకు దిగితే అన్ని వివరాలు బయట పెడతానని ఆయన చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో చంద్రశేఖరరావు వాస్తవాలు వెల్లడించటం లేదని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టు కింద రిజర్వాయర్ నిర్మించకుండా లక్షలాది ఎకరాలకు సాగునీరు ఎలా ఇస్తారని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల్లో నీటి పారుదల ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేసింది? ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారనే అంశంపై ఒక శే్వతపత్రాన్ని విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కాంతాలపల్లి రిజర్వాయర్ నిర్మించకుండా దేవాదుల నుండి సాగునీరు ఎలా ఇస్తారని ఆయన చంద్రశేఖరరావును నిలదీశారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది.. ఎక్కువ సీట్లు గెలుచుకుంటామనే విశ్వాసం తమకు ఉన్నదని ఆయన ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం అన్ని మతాలకు చెందిన ఉన్నత వర్గాల్లోని బీద ప్రజలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం విప్లవాత్మక నిర్ణయమని దత్తాత్రేయ ప్రశంసలు కురిపించారు.