దమ్ము, ధైర్యం ప్రధాని మోదీ సొంతం

సర్జికల్ స్ట్రైక్స్ మొదలు, జీఎస్టీ నుంచి నిన్నటి ఈబీసీ రిజర్వేషన్ల వరకూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దమ్ము, ధైర్యం ప్రధాని నరేంద్రమోదీ సొంతమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. దేశాభివృద్ధిని కాంక్షించే నోట్ల రద్దు నిర్ణయమైనా, మరో నిర్ణయమైనా సత్వరమే అమలుచేయడంలో నరేంద్రమోదీదే అగ్రపీఠమని ఆయన కొనియాడారు.

దేశహితం కోసం సరైన నిర్ణయాలను తీసుకోవడంలో నరేంద్రమోదీ ఎపుడూ ముందుంటారని తెలిపారు. అంత్యోదయ నిరుపేదలను సైతం పైకి తీసుకురావాలన్న సిద్ధాంతాన్ని అక్షరాలా అమలు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం పేదల సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడుతోందని, మతంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో పనిచేస్తోందని ఇంద్రసేనారెడ్డి చెప్పారు.

సంపన్నవర్గాలతో పేద విద్యార్థులు పోటీ పడలేకపోతున్నారని, పేద విద్యార్థులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే సహజ న్యాయాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. సమభావన, మానవత్వం, సామాజిక దృష్టి అనేవి రాజ్యాంగ స్ఫూర్తితో బీజేపీ అమలుచేస్తోందని తెలిపారు. అందరితో కలిసి అందరికోసం వారి అభివృద్ధి కోసమే అన్నట్టు సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ కార్యక్రమం అమలుచేస్తోందని చెప్పారు.

2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల కోసం, పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం ఆచరణలో పెట్టి అమలుచేశారని వివరించారు. ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పార్లమెంటులో సవరణ చట్టం ద్వారా సరిచేశారని, అలాగే ఏన్నో సంవత్సరాలుగా బీసీలు కోరుతున్నట్టు బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా పథకాన్ని భారత్‌లో అమలుచేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని వెల్లడించారు.

కులంతో ఆర్థిక పరిస్థితి పెరగదని, బ్రాహ్మణ స్థితిగతులపై తాను ఎంతో అధ్యయనం చేశానని, వారి దురవస్థను అందరిదృష్టికీ తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. బ్రాహ్మణ సమాజం అభివృద్ధికి కమిషన్ వేయాలని కోరామని, అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో బ్రాహ్మణ కార్పోరేషన్లు ఏర్పాటయ్యాయని తెలిపారు.