బీజేపీ ఉపాధ్యక్షులుగా ముగ్గురు మాజీ సీఎంలు

మరో మూడు నెలలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసే దిశలో బిజెపి జాతీయ మండళి సమావేశాలు శుక్ర, శని వారాలలో ఢిల్లీలో జరుగనున్నాయి. మొదటి సారిగా ఈ సమావేశాలకు జిల్లాస్థాయి పార్టీ నేతలను కూడా ఆహ్వానించారు. ఇప్పటి వరకు ఎన్నడూ జరుగని భారీ స్థాయిలో సుమారు 15 వేల మంది ప్రతినిధులతో సమావేశాలు జరుగనున్నాయి.

ఈ సమావేశాలకు ముందు రోజు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నియమించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజె, రమణ్‌సింగ్‌లను పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించారు.

నాలుగున్నరేండ్ల పాలనలో సాధించిన ప్రగతి, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువకావడం ప్రధాన అజెండాగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. శుక్రవారం సమావేశాలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభిస్తారు. సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ కార్యకర్తలకు వీరిద్దరు దిశానిర్దేశం చేయనున్నారు.

ముఖ్యంగా ఇటీవల మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు కీలక నిర్ణయాలను ప్రజల వద్దకు చేరవేయడం గురించి చర్చించే అవకాశం ఉంది. అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాలలో 10 శాతం రేజర్వేషన్లు, జి ఎస్ టి పరిమితులను పెంచడంతో పాటు మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించడం వంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది.