తమిళనాడులో పొత్తులకు ప్రధాని మోదీ ఆహ్వానం

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో ఎన్‌డీఏని బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్రమోదీ పొత్తులకు ఆహ్వానం పలికారు. పొత్తులకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఐదు జిల్లాలకు చెందిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 1990వ దశకంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంకీర్ణ రాజకీయాలను విజయవంతంగా నడిపారని మోదీ గుర్తు చేశారు.

20 ఏండ్ల క్రితం దార్శనిక నేత అటల్‌జీ దేశ రాజకీయాల్లో కొత్త సంస్కృతిని తెచ్చారు. అవే విజయవంతమైన సంకీర్ణ రాజకీయాలు. ప్రాంతీయ ఆకాంక్షలకు ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఆయన చూపిన బాటలోనే బీజేపీ పయనిస్తుంది అని మోదీ పేర్కొన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే, లేదా రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీతో బీజేపీ పొత్తుకు సిద్ధమా అని పార్టీ కార్యకర్త ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు.

2014 లోకసభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎండీఏ, పీఎంకే, ఎండీఎంకే తదితర ఆరు చిన్నపార్టీలతో కలిసి బరిలోకి దిగిన బీజేపీ కూటమి 39 స్థానాల్లో పోటీచేసి కేవలం రెండే స్థానాల్లో గెలుపొందింది. అందులో ఓ స్థానంలో బీజేపీ గెలుపొందగా, మరోచోట పీఎంకే విజయం సాధించింది. ఎన్నికల అనంతరం ఆ పార్టీలన్నీ ఎన్డీఏకి గుడ్‌బై చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాత మిత్రులకు ఆయన ఆహ్వానం పలికారు.

భారీ మెజార్టీ సాధించిన సందర్భాల్లో కూడా భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం నడిపేందుకే బీజేపీ ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు, ఆకాంక్షల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజలతో భాగస్వామ్యమే విజయవంతమైన భాగస్వామ్యమని, ప్రజలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలని కార్యకర్తలకు సూచించారు.