దేవగౌడపై పోటీకి బీజేపీ అభ్యర్థిగా తేజస్విని !

కర్ణాటకలో జెడి(ఎస్)- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులోనే కాకుండా ఆ ప్రభుత్వం కూలి పోకుండా కాపాడటంలో కూడా కీలక పాత్ర వహిస్తున్న మాజీ ప్రధాని దేవేగౌడపై దీటైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు బీజేపీ పావులు కడుపుతున్నది. కొన్నేళ్ళుగా హాసన్‌ లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న దేవేగౌడ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు ఉత్తర నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

హాసన్‌ లోక్‌సభ స్థానం ద్వారా మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణను రాజకీయ అరంగేట్రం చేయించనున్నట్లు ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశారు. దీంతో బెంగళూరు ఉత్తర నుంచి పోటీ చేసేందుకు దేవేగౌడ సిద్ధమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ మద్దతు ఉండడంతో గెలుపు సునాయాసమని ఆయన భావిస్తున్నారు.

ఇదే స్థానం నుంచి ప్రస్తుతం బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి సదానందగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సదానందగౌడ పోటీ చేస్తే రసవత్తరంగా ఉండదని భావించి తేజస్విని రమేశ్‌ను బిజెపి సిద్ధం చేస్తుండడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి చెలరేగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆమె  వ్యవహరిస్తున్నారు.

యువ పాత్రికేయురాలిగా 15ఏళ్ళక్రితం కనకపుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి దేవేగౌడపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తేజస్విని రమేశ్‌ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. ప్రస్తుతం బీజేపీనుంచి కూడా ఆమెను పోటీ చేయిస్తే గెలుపు సాధ్యమనే రీతిలో పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఆమె కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తూ 2014 ఎన్నికల ముందు బిజెపిలో చేరారు. కాంగ్రెస్ లో మగ నాయకులను లాంగికంగా సంతృప్తి పారేస్తే తప్ప మహిళా నాయకులకు అవకాశాలు రావంటూ విమర్శలు గుప్పించారు. 15 ఏళ్లుగా ఆమె దేవెగౌడ కుటుంబంపై రాజకీయంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం రాజకీయంగా తేజస్విని ఎంతో అనుభవం సాధించగా అందుకు రెట్టింపుగా దేవేగౌడ కూడా రాజకీయ చాణుక్యుడనే పేరు పొందారు. ఇటువంటి తరుణంలో దేవేగౌడకు సమఉజ్జీ తేజస్విని అయితే బాగుంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. తేజస్వినిని పోటీ చేయిస్తే రాజకీయ పరిణామాలు మారుతాయని బీజేపీ భావిస్తోంది. సదానందగౌడ ఇప్పటికే మరో నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు.