సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మ తొలగింపు

 సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే అలోక్‌ను హైపవర్ కమిటీ తొలగించింది. 

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్‌ వర్మను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా కొత్త డైరెక్టర్‌ నియామకాన్ని చేపట్టనున్నారు. ప్రధాని కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఆలోక్‌ వర్మకు పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వాలా, వద్దా అనే విషయాలను తేల్చడానికి ఉద్దేశించిన అత్యున్నత స్థాయి కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధాని మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష పక్షనేత మల్లికార్జున్ ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.సిక్రి ఉన్నారు. ఆలోక్‌ భవితవ్యంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ కమిటీ రెండు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపింది. 

సీవీసీ కమిటీ ఇచ్చిన నివేదిక బుధవారం అందకపోవడంతో గురువారం కూడా కమిటీ సమావేశమైంది. సీవీసీ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నివేదిక ఆధారంగానే తొలగించినట్లు తెలుస్తున్నది. అందులో ఆయనపై అవినీతి ఆరోపణలు ఉండడంతో వెంటనే తొలగించాలని ప్రధాని మోదీ, సిక్రి స్పష్టం చేశారు. 

అయితే ఈ నిర్ణయాన్ని పెండింగ్ లో ఉంచాలని మల్లికార్జున్ ఖర్గే కోరినా మిగిలిన ఇద్దరు ఒప్పుకోలేదు. విచారణ జరుపని నివేదికను యెట్లా నమ్ముతామని ఆయన వాదిస్తూ నిర్ణయం పట్ల అసమ్మతిని తెలిపారు. మరో వారం రోజులలో కొత్త డైరెక్టర్ ను ఎంపిక చేయవలసి ఉంది. ప్రస్తుతానికి అగ్నిమాపక దళ డైరెక్టర్ జనరల్ గా అలోక్ వర్మను నియమించారు. ఆయన ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. 

ఇదిలా ఉంటే ఈ నిర్ణయం వెలువడటానికి కొన్ని గంటల ముందు ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు అలోక్ వెర్మ ఆదేశాలు జారీ చేశారు. అస్థానా కేసును విచారిస్తోన్న డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్‌ గౌబా, జేడీ మురుగేశన్‌, ఏడీ ఎ.కె.శర్మలను బదిలీ చేశారు. దీంతో పాటు అస్థానా కేసు విచారణను 2006 ఐపీఎప్‌ బ్యాచ్‌కి చెందిన అధికారి మోహిత్‌ గుప్తాకు అప్పగించారు.

ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రచ్చకెక్కడంతో వారిద్దరి అధికారాలను వెనక్కి తీసుకొని, వారిని బలవంతపు సెలవుపై పంపుతూ సీవీసీ, కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 23న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే రోజున ఒడిశా క్యాడర్‌ అధికారి ఎం.నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు. 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆలోక్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం రెండు రోజుల క్రితం ఆలోక్‌కు తిరిగి పగ్గాలు అప్పగించాల్సిందిగా తీర్పునిచ్చింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. దీంతో సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ బుధవారం తిరిగి బాధ్యతలను స్వీకరించారు.

రిగి బాధ్యతలను స్వీకరించారు.