ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

దేశంలోని అన్ని మతాలకు చెందిన అగ్రవర్ణాల్లోని బీద ప్రజలకు ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం ముద్ర వేసింది. ఈ సవరణ బిల్లుకు అనుకులంగా 165 ఓట్లు పడగా, కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. రిజర్వేషన్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలన్న డీఎంకే తీర్మానం వీగిపోయింది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న మరో తీర్మానం కూడా వీగిపోయింది. 

వెనుకబడిన కులాలకు చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత వర్గాలలోని బీద ప్రజలకు ప్రభుత్వా ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక అంశమని సామాజిక న్యాయ శాఖా మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఈ బిల్లును మంగళవారం భారీ మేజారిటీతో ఆమోదించడం తెలిసిందే. లోక్‌సభ ఆమోదించిన పది శాతం రిజర్వేషన్ల బిల్లును రాజ్యసభ బుధవారం రాత్రి భారీ మెజారిటీతో ఆమోదించింది. 

కేంద్ర సాంఘిక న్యాయ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ ప్రతిపాదించిన పదిశాతం రిజర్వేషన్ల బిల్లుపై రాజ్యసభలో దాదాపు తొమ్మిది గంటల పాటు సుధీర్ఘ చర్చ జరిపిన అనంతరం సభ్యులు దీనిని ఆమోదించారు. లోక్‌సభలో మెజారిటీ పార్టీలు మద్దతు ఇచ్చినందున రాజ్యసభలో కూడా అన్ని పార్టీలు భారీ మెజారిటీతో బిల్లును ఆమోదించాలని తావర్‌చంద్ గెహ్లాట్ విజప్తి చేశారు. కాగా, పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన పది శాతం రిజర్వేషన్ల బిల్లును రాష్టప్రతి ఆమోదం కోసం పంపిస్తారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనికి ఆమోద ముద్ర వేయగానే ప్రభుత్వ గెజిట్ జారీ అవుతుంది.

 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరించినట్టు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించవలసిన అవసరం లేనందువల్ల ఇది వెంటనే అమలులోకి వస్తుందని సమాచారం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారుల అర్హతలను నిర్ధారించగానే ఈ రిజర్వేషన్లు రాష్టల్రలో కూడా అమలులోకి వస్తాయి.విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్‌ను అమలు చేస్తారు. ఈబీసీల రిజర్వేషన్ల కోసం ఆర్టికల్ 15, 16 కు సవరణలు చేస్తారు. ఆర్టికల్ 15 కు క్లాజ్(6), 16 కు క్లాజ్ (6)ను కేంద్రం చేర్చింది. ఈబీసీలకు రిజర్వేషన్లు 50 శాతం కోటా పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. 50 శాతం కోటాకు అదనంగా ఈబీసీలకు రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. చట్టబద్ధత కోసమే ఆర్టికల్ 15, 16 లకు అదనపు క్లాజులను జోడించినట్లు కేంద్రం వెల్లడించింది.

హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ద, జైన్ మతాలకు చెందిన అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆర్‌జేడీ మినహా మిగతా అన్ని ప్రతిపక్షాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల ఆఖరున పది శాతం రిజర్వేషన్ల బిల్లును తీసుకురావడం పట్ల తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపాయి. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటిస్తారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా ప్రకటించారు.  శీతాకాల సమావేశాల ఆఖరు రోజు మోదీ ప్రభుత్వం రిజర్వేషన్ల సిక్సర్ కొట్టింది.. ఇకమీదట కూడా మరిన్ని సిక్సర్లు కొడతామని ఆయన చెప్పారు. క్రికెట్‌లో మ్యాచ్ మొగిసే సమయంలో సిక్సర్లు వస్తాయనేది మీకు తెలియదా..? ఇప్పుడదే జరుగుతోందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు రోజురోజుకు తగ్గిపోతున్నందున ప్రైవేట్ రంగాన్ని కూడా రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపక్షంతోపాటు కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కూడా డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించడంతోపాటు న్యాయ శాఖలో కూడా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వీలుగా జాతీయ న్యాయ ఎంపిక విధానాన్ని అమలు చేయాలని పాశ్వాన్ కోరారు. రిజర్వేషన్లలో ప్రమోషన్లను ఎందుకు అమలు చేయటం లేదని కాంగ్రెస్ సభ్యురాలు కుమారి షెల్జా డిమాండ్ చేశారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని సీపీఐ సభ్యుడు రాజా డిమాండ్ చేశారు. 10 శాతం రిజర్వేషన్లు బిల్లును ఆమోదించిన అనంతరం రాజ్యసభ నిరావధికంగా వాయిదా పడింది.