ముందస్తుకు కెసిఆర్ కు చుక్కెదురు !

లోక్ సభతో కలిపి అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే తనకు ప్రభావం తప్పదని గ్రహించి వచ్చే డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాలతో కలిపి ముందస్తు ఎన్నికలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చెంద్రసేఖరరావు జరుపుతున్న ప్రయత్నాలు బెడిసి కొట్టిన్నట్లు తెలుస్తున్నది. జనవరి 1 న ఎన్నికల కమీషన్ సవరించిన వోటర్ల జాబితాను ప్రతి సంవత్సరం ప్రకటిస్తుందని, అందుచేత ఈ లోగా అసెంబ్లీని రద్దు చేసుకొంటే రాష్ట్రపతి పాలన రావడం మినహా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో కెసిఆర్ హడావుడిగా ఢిల్లీ వెళ్ళారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇస్తే ముందుకు పొవాలని అనుకొన్నారు.

అయితే కెసిఆర్ అభ్యర్ధనను సానుకూలంగా విన్న ప్రధాని ఎన్నికల కమీషన్ ఒప్పుకొంటే తనకు అభ్యంతరం లేదని తప్పించుకొన్నారని తెలుస్తున్నది. ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ ఉండబోదని స్పష్టం చేసిన్నట్లు కుడా చెబుతున్నారు. దానితో కెసిఆర్ ఒకింత నిరుత్సాహానికి గురయి ప్రధానిని కలసిన తర్వాత బయట ఎదురు చూస్తున్న మీడియా ప్రతినిధులను కుడా కలువకుండా తప్పించుకున్నారు.

ఈ విషయమై ముందస్తు ఎన్నికలు జరపడం సాధ్యం కాదని అంటూ ఎన్నికల కమీషన్ అధికారులు సహితం స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. పలువురు మంత్రివర్గ సహచరులు కుడా ఈ విషయమై తొందరపాటు వద్దని సూచించినట్లు తెలిసింది. అసెంబ్లీని రద్దు చేస్తే ఆపధర్మ ప్రభుత్వంగా ఆరు నెలలకు మించి కొనసాగే అవకాశం ఉండదని, పైగా ఆ సమయంలో ఎటువంటి విధనపరమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండబోదని కుడా వారించిన్నట్లు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వల్లన అదనంగా వచ్చే ప్రయోజనం కుడా ఏమీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

నాలుగు రాష్ట్రాలకు డిసెంబర్‌లో జరిగే ఎన్నికలు మూడు, నాలుగు విడతలుగా నిర్వహించాల్సి ఉండటం, భద్రతాదళాలు, ఎన్నికల సిబ్బంది, ఇతర ఏర్పాట్లు ఇప్పటికే ఆ రాష్ట్రాలలో పూర్తికావటం, లోకసభ సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెల లోపు నిర్వహించవలసి ఉండటంతో తెలంగాణ శాసనసభకు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ల జాబితా వచ్చే సంవత్సరం జనవరి నాలుగో తేదీన విడుదల కావలసి ఉంది.

సెప్టెంబర్‌లో శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధపడిన ముఖ్యమంత్రి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై వివరాలు సేకరించడానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మను మూడు రోజుల క్రితం ఢిల్లీకి పంపించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన ఆయన ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి తెలియచేశారు. దీంతో హుటాహుటీన ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి ఈ విషయమై సహాయం చేయమని కోరిన్నట్లు తెలుస్తున్నది.

నాలుగు రాష్ట్రాల్లో డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు ఆ రాష్ట్రాలలో ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణా వచ్చినా వాటితో పాటు ఎన్నికలు జరపడం అసాధ్యమని ఎన్నికల కమీషన్ స్పష్టం చేయడంతో కెసిఆర్ కు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.