క్లర్క్‌లా పని చేస్తున్నా : కుమారస్వామి నిర్వేదం

కర్నాటకలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి భాగస్వామ్య పక్షాలైన జెడిఎస్, కాంగ్రెస్ మధ్య విభేదాలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపే కూలిపోయే అవకాశం ఉన్నదని స్వయంగా ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామే  పంపుతున్నారు. కాంగ్రెస్ నుండి వస్తున్న వత్తిడుల కారణంగా స్వతంత్రంగా పనిచేయలేక పోతున్నట్లు వాపోతున్నారు. కాంగ్రెస్ వత్తిడులతో తనకు తాను ఒక క్లర్క్ వలే పనిచేస్తున్నట్లు పార్టీ సహచరుల వద్ద వాపోయారు. 

బుధవారం  జెడిఎస్ ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సిలతో సమావేశమైన ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ నాయకుల జోక్యం కారణంగా తాను ముఖ్యమంత్రిగా కాక ఒక గుమాస్తాలా పనిచేయాల్సి వస్తోందని భావోద్వేగంతో వాపోయినట్లు తెలుస్తున్నది.  బిజెపిని అధికారంలోకి రానివ్వకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌తో చేతులు కలిపిన తర్వాత తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వారితో పంచుకున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్ నాయకులు తమకు లాభం చేకూర్చే పనులన్నీ నా చేత బలవంతంగా చేయిస్తున్నారని ఆరోపించారు.  వారి మాటలు వినడం తప్ప తనకు  వేరే గత్యంతరం లేకుండా పోతోందని నిర్వేదం వ్యక్తం చేశారు.  తీవ్రమైన ఒత్తిడితో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రిని అని కూడా చూడకుండా తమ కింద పని చేసే గుమాస్తాగా కాంగ్రెస్ నాయకులు తనను చూస్తున్నారని  అంటూ కుమారస్వామి కంటతడి పెట్టుకున్నట్లు తెలిసింది. 

కాంగ్రెస్‌ నేతలు తనను వాళ్ల కింద పని చేసే వ్యక్తిగా చూస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయన చాలా బాధపడుతున్నారు. ఏడ్చినంత పని చేశారు. కాంగ్రెస్‌ తమ కంటే పెద్ద అన్నట్లుగా వాళ్లు ప్రవర్తిస్తున్నారని సీఎం చెప్పారు. అన్ని రకాల ఆదేశాలపై సీఎంతో బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు. కేబినెట్‌ను విస్తరించమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థలకు ఛైర్‌పర్సన్‌ నియామకాలు చేపట్టేందుకు కూడా కాంగ్రెస్‌ అనుమతి కావాలి. ప్రతి రోజు ఆయనకు చాలా కష్టంగా గడుస్తోంది’ అని సమావేశానికి హాజరైన జేడీఎస్‌ ఎమ్మెల్యే ఒకరు సీఎం బాధను చెప్పుకొచ్చారు.   

అన్ని రకాల ఉత్తర్వులపై కుమారస్వామి చేత సంతకాలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. బలవంతంగా క్యాబినెట్ విస్తరణ చేయించారని, తన ఆమోదం లేకుండానే కార్పరేషన్లకు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బోర్డులకు చైర్మన్లను నియమించుకున్నారని వెల్లడించారు. రోజురోజుకూ తన పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని పార్టీ సహచరుల ముందు వాపోయారు. 

అయితే ఈ సమావేశంలో పాల్గొన్న జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవె గౌడ మాత్రం పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేవరకు సంకీర్ణ ప్రభుత్వం పడిపోకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కర్నాటకలో కనీసం అరడజను లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంపై తాను దృష్టి పెట్టానని, పార్టీ విజయావకాశాలను ఈ తరుణంలో తాను దెబ్బతీసుకోలేనని దేవె గౌడ అన్నారని తెలిసింది.లోక్‌సభ ఎన్నికలు జరిగేంత వరకు వేచి చూడాలని దేవ్‌గౌడ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

గతంలోను సీఎం కుమారస్వామి కాంగ్రెస్‌ నేతల ప్రవర్తన పట్ల ఆవేదన చెందారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయంలోను మాజీ సీఎం సిద్ధరామయ్య జోక్యం చేసుకుంటున్నారని, శివుడి గరళాన్ని మింగిన శివుడిలా తన పరిస్థితి మారిందంటూ కుమారస్వామి గతంలో కన్నీరు పెట్టిన విషయం తెలిసిందే.