ఫిబ్రవరి 2న నుంచి బిజెపి బస్సుయాత్ర, 18న కడపకు అమిత్ షా

ఆంధ్ర ప్రదేశ్ లో  భారతీయ జనతాపార్టీ బూత్‌స్థాయి కార్యకర్తలు, నాయకులతో ఈ నెల 18న బిజెపి  జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కడపలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై ఆయన సమీక్ష చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

గుంటూరులోని బిజెపి  రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఫిబ్రవరి 2న  శ్రీకాకుళం నుంచి బస్సుయాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేశారు.   కాకినాడ ఘటన, గుంటూరులో కన్నా ఇంటిముట్టడికి సంబంధించి టిడిపి  నాయకులపై గవర్నర్‌, డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నాయకులు త్వరలో కేంద్ర హోంమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.  

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని, ఇందుకు ప్రతి నేత తమ తమ పరిధిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.  ఓ పక్క టీడీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, మరో పక్క ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపిచ్చారు. తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందిన అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ల కేటాయింపు అంశాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ పట్ల జనం ఆకర్షితులయ్యేలా చూడాలని సూచించారు. 

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లేందుకు శ్రేణులను సన్నద్ధం చేయాలని స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, రాష్ట్రప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో రాష్ట్భ్రావృద్ధి కోసం విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల అమలుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని, విడుదల చేస్తున్న నిధుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని కన్నా  సూచించారు. 

చంద్రగిరి నేతలు  బీజేపీలో 

కాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన మేడసాని పురుషోత్తం నాయుడు, పాకాల మండలానికి సంబంధించిన మేడసాని మనోహర్ చౌదరి ఇరువురూ కన్నా సమక్షంలో బీజేపీలో చేరారు. మేడసాని పురుషోత్తమ నాయుడు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఓడించిన వెంకట్రామనాయుడికి స్వయాన సోదరుడి కుమారుడు కావడం గమనార్హం. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిలు సతీష్‌జీ, సునీల్ దియోదార్, నేతలు పురంధరేశ్వరి, మాణిక్యాలరావు, సోము వీర్రాజు, వి సత్యమూర్తి, సురేష్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.