‘మిషెల్‌ మామ’తో కాంగ్రెస్ నేతల బంధమేంటి?

రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు అంశంలో తమపై ఆరోపణలు చేసేలా కాంగ్రెస్‌ను ప్రేరేపిస్తున్నది ఏంటో ఆ పార్టీ చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిమాండ్‌ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని మోదీ ఉటంకిస్తూ, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉండి అరెస్టయిన క్రిస్టియన్‌ మిషెల్‌.. యూపీఏ కాలం నాటి రఫేల్‌ ఒప్పందంలో డసో ఏవియేషన్‌ ప్రత్యర్థిగా ఉన్న మరో కంపెనీ యూరోఫైటర్‌ తరఫున లాబీయింగ్‌ చేశాడనీ, కంపెనీకి, ప్రభుత్వ పెద్దలకు నడుమ కూడా మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపించారు.

రఫేల్‌ ఒప్పందం అప్పట్లో నిలిచిపోవడానికి కారణం మిషెల్‌ మామ ఒప్పందాలేనా అని ప్రశ్నించారు. రఫేల్‌ అంశంపై ఎందువల్ల ఆరోపణలు చేస్తున్నారో కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 ‘యూపీఏ పాలనలో.. వ్యవస్థలో అంతర్భాగంగా దళారీల సంస్కృతి ఉండేది.ఆ ప్రభుత్వ హయాంలో హెలికాప్టర్ల కొనుగోలులోనే కాకుండా రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలోనూ దళారీగా మిషెల్‌ వ్యవహరించారు. వారి పార్టీలో ఏ నాయకునికి మిషెల్‌తో ఎలాంటి సంబంధం ఉందనేది రఫేల్‌ ఒప్పందంపై ఇప్పుడు అరుస్తున్న కాంగ్రెస్‌ నేత (రాహుల్‌) చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

‘కమిషన్లు స్వీకరించేవారి స్నేహితులంతా ఇప్పుడు ఈ చౌకీదార్‌ గురించి కలలో ఉలిక్కిపడుతున్నారు. నేను అందరిలాంటివాడిని కాను. నన్నెవరూ కొనలేరు. ఎవరూ నన్ను భయపెట్టలేరు. వారు నాపై ఎన్ని అబద్ధాలు చెప్పినా, దూషణల వర్షం కురిపించినా అవినీతి ప్రక్షాళన కార్యక్రమం కొనసాగి తీరుతుంది’ అని మోదీ స్పష్టంచేశారు. ‘ప్రతి పైసాకు లెక్క తేలుస్తా. అవినీతి మకిలి వదిలిస్తా, ఈ కాపలాదారుడు (చౌకీదార్‌) విశ్రాంతి ఎరుగడుఅని తేల్చి చెప్పారు. 

ఈ విషయం నిజమో కాదో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు. ‘రఫేల్‌ అంశంలో కాంగ్రెస్‌లోని ఏ నేతతో మిషెల్‌కు సంబంధాలున్నాయో ఆ పార్టీ చెప్పాలి. ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు లెక్క చూపాలి’ అని డిమాండ్‌ చేశారు. ఉన్నత కులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్‌సభ సజావుగా ఆమోదించడమే.. తమపై అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న వారికి గట్టి సమాధానమని మోదీ అన్నారు. దళితులు, గిరిజననులు తదితరుల హక్కులపై ఈ బిల్లు ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఆయన బుధవారం పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘గత ప్రభుత్వాల కాలంలో మధ్యవర్తుల వ్యవస్థ పాలనలో భాగంగా ఉండేది. ఆ ప్రభుత్వాలు పేదల హక్కులను హరించాయి. దేశ భద్రతతోనూ ఆటలాడుకున్నాయి’అని మోదీ అన్నారు. అలాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన బిల్లుపై మోదీ మాట్లాడుతూ, దీని కారణంగా అస్సాం లేదా ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజల హక్కులకు భంగం కలగదన్నారు.