కోటా బిల్లుపై అసత్యాలు ప్రచారం : మోదీ

ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు రాజ్యసభలోను ఆమోదం పొందుతుందని ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రజల అభిప్రాయాలను గౌరవించి రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకు ఎటువంటి అడ్డంకి లేకుండా ఆమోదం తెలపాలని ఆయన కోరారు.

‘గత రాత్రి లోక్‌సభలో చారిత్రక బిల్లుకు ఆమోదం లభించింది. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు లభించేలా చేయడం కోసం 10 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తోంది. మా నినాదం ఒక్కటే సబ్‌కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌'  అని పేర్కొన్నారు.

పది శాతం రిజర్వేషన్ వల్ల బలహీన వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లకు ఎంతమాత్రం విఘాతం కలగదని ప్రదాని హామీ ఇచ్చారు. దళితులు, గిరిజనులు సహా బడుగు వర్గాల హక్కులకు కొత్త బిల్లుతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. బలహీన వర్గాల నుంచి రిజర్వేషన్ ఊడలాక్కుని అగ్రవర్ణాల వారికి ఇస్తారంటూ కొన్ని విపక్షాలు జరుపుతున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.పది శాతం అనేది అదనపు కోటా కిందకు వస్తుందని చెప్పారు. ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించడం చరిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు.

ఈ బిల్లుకు వ్యతిరేకంగా కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. కాని రాజ్యసభ సభ్యులు ప్రజాభీష్టం మేరకు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారని భావిస్తున్నానని చెప్పారు. కోటా బిల్లు కోసం మాత్రమే రాజ్యసభ సమావేశాలను ఒక రోజు పొడిగించామని చెప్పారు.

పౌరసత్వ సవరణ బిల్లుపైనా ఆయన స్పందిస్తూ ఈ బిల్లు కారణంగా అసోం వంటి ఈశాన్య రాష్ట్ర ప్రజల హక్కులకు ఎటువంటి భంగం వాటిల్లదని భరోసా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది చాలా కీలకమైన బిల్లు అని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్‌ నుంచి వచ్చే ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే కీలకమైన బిల్లు ఇదన్నారు. భారతదేశంలో నివసించాలని కోరుకునే ఇతర దేశాల వలసదారులకు ఇప్పుడు భారత పౌరసత్వం లభిస్తుందని పేర్కొన్నారు.