సిబిబి డైరెక్టర్ నియామక కమిటీకి గొగోయ్ దూరం

సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ విషయంలో నిర్ణయం తీసుకోనున్న అత్యున్నత స్థాయి కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టి రంజన్‌ గొగొయ్‌ తప్పుకున్నారు. ఆలోక్‌ వర్మను తిరిగి విధుల్లో చేరాలని, ఆయనను సెలవుపై పంపడం తగదని నిన్న తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో రంజన్‌ గొగొయ్‌ భాగమై ఉన్నందున ఆయన ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. గొగొయ్‌ తన స్థానంలో జస్టిస్‌ ఏకే సిక్రీని ప్రతిపాదించారు.

ఆలోక్‌ వ్యవహారంలో నిర్ణయం తీసుకునేందుకు కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ లేదా ఆయన నామినీ సభ్యులుగా ఉంటారు. ఆలోక్‌ విషయంలో ఈ కమిటీ వారం లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. దీంతో మోదీ, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, జస్టిస్‌ ఏకే సిక్రీలతో కూడిన కమిటీ ఆలోక్‌పై చర్యల విషయంలో నిర్ణయం తీసుకోనుంది.

తగు నిర్ణయం తీసుకోవడానికి సుప్రీం కోర్ట్ ఈ కమిటీకి వారం రోజుల సమయం  ఇచ్చినా, తీర్పు ఇచ్చిన మరుసటి రోజుననే బుధవారం కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ భావించినట్లు తెలుస్తున్నది. అయితే ఇంత తక్కువ వ్యవధిలో ఈ సమావేశానికి హాజరు కావడం తనకు కుదరదని తెలుపుతూ మల్లికార్జున్ ఖర్గే ప్రభుత్వానికి లేఖ వ్రాసిన్నట్లు తెలుస్తున్నది. పార్లమెంట్ సమావేశాలలో తీరిక లేకుండా ఉన్న తనకు సుప్రీం కోర్ట్ తీర్పు పూర్తిగా పరిశీలించే సమయం చిక్కలేదని ఆ లేఖలో తెలిపారు. 11వ తేదీ సమావేశం ఏర్పాటు చేయమని సూచించినట్లు చెబుతున్నారు.

సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ అస్థానాల మధ్య వివాదాలు రచ్చకెక్కడంతో కేంద్రం వారిద్దరినీ అక్టోబరులో సెలవుపై పంపింది. తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాలు చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆలోక్‌ను బలవంతంగా సెలవుపై పంపడం కుదరదని, ఆయన్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్‌ తాత్కాలిక సస్పెన్షన్‌ లేదా తొలగింపునకు సంబంధించి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. అలాంటి నిర్ణయాలను ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ అనుమతితో మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది.