అప్పుల్లో కూరుకుపోతున్న ఆంద్ర ప్రదేశ్

ఆర్ధిక వనరులు లేకపోయినా రాష్ట్రాన్ని ఘనంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఊబిలో కూరుకు పోయేటట్లు చేయడంలో మాత్రం విశేషమైన ప్రగతి సాధిస్తున్నారు. అడ్డదిడ్డంగా ఎక్కడపడితే అక్కడ అప్పులు చేయడంలో మాత్రం ఆసక్తి చూపుతున్నారు. గత నాలుగేళ్ల పాలనలో ఆయన ఇప్పటి వరకూ సుమారు రూ.1.20 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకొచ్చారు. తిరిగి అమరావతి రాజధాని కోసం మరో రూ 48 వెల కోట్ల మేరకు అప్పులు చేయాలని చూస్తున్నారు.

ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రూ.26 వేల కోట్ల విలువైన పనులు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు హడ్కో నుండి రూ.1275 కోట్లు తీసుకోగా వాటిని పూర్తిగా ఖర్చు చేశారు. పైగా బాండ్ల రూపంలో తీసుకునే రూ.2000 కోట్లను తిరిగి చెల్లించే సమయాన్ని మొత్తం లెక్కవేసుకుంటే సుమారు రూ.1500 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

అప్పు ఎంత తీసుకుంటే అంత మొత్తాన్ని తిరిగి చెల్లించే పద్ధతి గతంలో ఎన్నడూ లేదు. ఇలా చేయడం వెనుక పెద్ద కుంభకోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా హడ్కో నుండి తీసుకునే రుణానికి 8 శాతం లోపు వడ్డీ అయితేనే తీసుకోవాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీచేసిన జిఓ నెంబరు 8లో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయం ఉంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్లు ఆరుశాతం వడ్డీకి విడుదల చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. అయినా బాండ్లకు మాత్రం 10.7 శాతం వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

అయితే బాండ్లకు భూములు తనఖా పెట్టాల్సిన అవసరం లేదని, ఇతర అప్పులకు తనఖా పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. దీని ప్రకారం 1.20 లక్షల కోట్లకు ఎక్కడెక్కడ ఆస్తులు తనఖా పెట్టారో తేల్చాల్సి ఉంది. హడ్కో తనఖా పెట్టుకునే ఆస్తులు ఆదాయాన్ని తెచ్చిపెట్టేవిగా ఉండాలి. విజయవాడ నగరంలో గతంలో రూ.100 కోట్లు అప్పు తీసుకుంటే దానికి రూ.150 కోట్ల విలువైన ఆస్తులు తనఖా పెట్టారు. చెల్లింపుల కోసం ప్రత్యేక ఎకౌంంటు ఓపెన్‌ చేసి, దాని ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు.

అప్పు చెల్లించడం కోసం ప్రజలపై ఇష్టారీతిన భారాలు మోపక తప్పడం లేదు. రూ.1000 పన్ను చెల్లించే కళ్యాణ మండపానికి రూ.10 వేలకు పెంచారు. అదే తీరిలో ప్రజలపై పన్నుల భారం అమితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న అప్పును సుమారు 30 నుండి 35 ఏళ్ల పాటు ప్రజలు చెల్లించే పన్నుల్లో నుండే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అప్పులకు సంబంధించి వరుసగా జరుగుతున్న పరిణామాలతో  ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.