జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు నేడే

ఏడాదికిపైగా ప్రజలతో మమేకమై, రాష్ట్ర అంతా చుట్టుకొంటూ వచ్చిన ప్రతిపక్ష నేత, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర నేడు ప్రజాసంకల్పయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. 2017 నవంబర్ 6న స్వగ్రామం ఇడుపులపాయ నుంచి మాతృమూర్తి విజయమ్మ ఆశీస్సులతో, తండ్రి 

అశేష జనవాహిని మధ్య డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులు అర్పించి ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టారు. నేడు ముగింపు సభ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరగనుంది. 

341 రోజుల పాటు జరిగిన ఈ యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి 134 నియోజకవర్గాలలో పర్యటిస్తే 124 బహిరంగ సభలలో ప్రసంగించారు. మొత్తం మీద 3,648 కి మీ మేరకు పాదయాత్ర జరిపారు.  వివిధ సామాజిక వర్గాలు, కులవృత్తుల వారితో 55 ఆత్మీయ సమ్మేళనాలు జరిపారు. ‘అన్న వస్తున్నాడు.. మంచి రోజులొస్తున్నాయి’ అంటూ మొత్తం 13 జిల్లాల మీదుగా జగన్‌ పాదయాత్ర కొనసాగించారు.   231 మండలాల్లో 2,516 గ్రామాలను చుట్టుకొంటూ వచ్చారు. 54 పురపాలక సంఘాలు, 8 నగర పాలక సంస్థల వెంట ఆయన యాత్ర కదిలింది. 

కేవలం అధికారమలో ఉన్న తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే కాకుండా, తాను అధికారమలోకి వస్తే వివిధ వర్గాల ప్రజలు ఏ విధంగా మేలు చేయదలిచానో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. వివిధ రంగాలలో తాను తీసుకు రాదలచిక్కున వినూత్న మార్పులను, చేపట్టనున్న పలు  నూతన పధకాలను సవివరంగా వివరించారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసిపి  ప్రధాన హామీలైన నవరత్నాల గురించి బహిరంగ సభల్లో వివరించారు. 

పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభను వైసిపి నిర్వహిస్తోంది. ఇచ్ఛాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల ముందు ఏర్పాటు చేసిన పాదయాత్ర విజయ స్తూపాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.  ప్రజా సంకల్ప పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురం ముఖద్వారంలోని లొద్దపుట్టి వద్ద భారీ స్తూపాన్ని పార్టీ ఏర్పాటు చేస్తోంది. 

ఈ స్తూపం నిర్మాణానికి ముందుకొచ్చిన వైసిపి నాయకుడు కాయల వెంకటరెడ్డి (కేవీఆర్‌) 35 సెంట్ల స్థలాన్ని కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ బృందంతో స్తూపం నమూనాను తయారు చేయించారు. పనులన్నీ కేవీఆర్‌ తన అనుచరుల పర్యవేక్షణలో రాత్రీ పగలు చేయిస్తున్నారు. మొత్తం 88 అడుగుల ఎత్తున స్తూపం ఉంటుంది. 13 జిల్లాలను గుర్తుచేసేలా 13 మెట్లుంటాయి. పైన 15 అడుగుల ఎత్తున పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.   

నాటు ముఖ్యమంత్రిగా తండ్రి రాజశేఖరరెడ్డి అమలు పరచిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పధకాలను నేటి అవసరాలకు అనువుగా మరింతగా మెరుగు పరచి ఏ విధంగా అమలు చేయాలి అనుకొంటున్నానో తెలియ చెప్పారు. ఒకొక్క సభలో ఒకొక్క వర్గం ప్రజలకు అమలు చేయాలి అనుకొంటున్న కార్యక్రమాల గురించి,  ఒకొక్క రంగంలో తీసుకు రాదలచిన మార్పుల గురించి, అందుకోసం రూపొందించిన నవరత్నాల కార్యక్రమం గురించి సవివరంగా వివరించారు. బహుశా ఇప్పటి వరకు ఏ పార్టీ, నేత కూడా అధికారమలోకి వస్తే తాము చేయదలచిన కార్యక్రమాల గురించి నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి ఈ విధంగా వివరించిన సందర్భం లేదని చెప్పవచ్చు. 

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి చివరిరోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ బుధవారం  ప్రారం​భించారు. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిందరినీ చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగారు. 

చివరిరోజు పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు వైఎస్‌ జగన్‌ వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. జననేత  పాదయాత్ర సాగుతున్న దారిలో యువత కోలాహలం కన్పిస్తోంది.   దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమార్తె షర్మిల కూడా తమ పాదయాత్రలను గతంలో ఇచ్చాపురంలోనే ముగించడం గమనార్హం.