పాదర్శకతకు నిలువెత్తు నిదర్శనం వాజపేయి

స్వార్థం లేని రాజకీయ నాయకుడు ఉంటాడని వాజపేయి నిరూపించారని, పాదర్శకతకు ఆయన నిలువెత్తు నిదర్శనం అని  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ సంబిత్ పాత్ర పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతాప సభలో మాట్లాడుతూ పూర్తి కాలం కొనసాగిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అని కొనియాడారు. దేశానికి నిజమైన భారత రత్నం అని అంటూ  ఆయన హయాంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నిలిచిందని, దేశం సాంకేతికంగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.

ఆయన అనుసరించిన విదేశాంగ విధానం ఎన్నదగిందని చెబుతూ ఆయన పేరులోనే నిత్యం తిరుగుతూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అర్థం స్ఫురిస్తుందని చెప్పారు. అమెరికాతో పాటు ఏ ఇతర దేశాలతో ఇబ్బంది లేకుండా అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించగలిగారని గుర్తు చేసారు. ‘వాజపేయి పెట్టిన చెట్టు బీజేపీ. అది ఆయన కాలంలోనే ఫలాలు ఇవ్వడం ఆనందదాయకం’ అని పేర్కొంటూ భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని, టెలికం విప్లవం, కార్గిల్ గెలుపు వంటివి ఎన్నో విజయాలున్నాయని వివరించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్ మాట్లాడుతూ వాజపేయి ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని పేర్కొన్నారు. భారతదేశాన్ని అణుశక్తి దేశంగా ఆవిష్కరించడానికి ఆయన చూపింది వజ్రసంకల్పమని కొనియాడారు. గొప్ప కవి, ఉత్తమ పార్లమెంటేరియన్‌ను దేశం కోల్పోయిందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థి పార్టీ నేతల మెప్పు కూడా పొందిన నేతగా వాజపేయిని అభివర్ణించారు. తెలుగు రాష్ట్రాలతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు.

ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వాజ్‌పేయి లాంటి నేత ప్రస్తుత రాజకీయాల్లో కన్పించారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ పేదల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు.

రాజకీయాల్లో మానవత్వం ఉండాలని కోరుకున్న ఏకైక నాయకుడు వాజ్‌పేయి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. అణుకువ కలిగిన ప్రేమ పూరిత రాజకీయాలు చేశారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు అధ్యక్షత వహించారు.