రిజర్వేషన్ల బిల్ సాహసోపేత నిర్ణయం

అగ్రవర్ణాల్లోని పేదలకు (ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్ కల్సిస్తూ  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేత నిర్ణయం అని తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు కొనియాడారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ గుర్తు చేశారు.  10 శాతం రిజర్వేషన్లతో అగ్రవర్ణాల్లోని పేదలకు భరోసా అని  పేర్కొన్నారు. గత 70 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి తీసుకోని నిర్ణయం మోదీ తీసుకున్నారని కొనియాడారు. 

ఇది చారిత్రక నిర్ణయమని బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని దశాబ్దాల నుంచి డిమాండ్ ఉందని చెబుతూ సామాజిక వివక్షకు సంబంధించిన రిజర్వేషన్లతో పాటు ఆర్థిక వెనుకబాటు ఆధారంగా కూడా రిజర్వేషన్లు అవసరమని చెప్పారు.  కాంగ్రెస్ ఇంకా విభజన రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తుందని ఆరోపించారు.

రిజర్వేషన్లపై ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలు అర్ధరహితమని దుయ్యబట్టారు. పేదలకు రిజర్వేషన్లు ఇస్తే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇది ఎన్నికల కోసం కాదని వెల్లడించారు. కాన్షిరామ్ కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారని గుర్తుచేశారు. మాయావతి, ములాయం కూడా ఈ బిల్లును సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి పెరిగిన రిజర్వేషన్లు అమలు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.