ఒకొక్క విద్యుత్ వాహనానికి రూ 1.4 లక్షల రాయితీ

విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగానికి భారీ ఎత్తున ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దపడుతున్నది. ఒక్కో విద్యుత్ కారు కోసం దాదాపు రూ.1.4 లక్షల రాయితీని నేరుగా అందించే విధంగా అడుగులు వేస్తున్నది. ద్వి, త్రిచక్ర తదితర ఇతరత్రా విద్యుత్ వాహనాల కొనుగోళ్లపైనా ప్రోత్సాహకాలను పొడిగించింది. అంతేగాక ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో లేని ఎగువ శ్రేణి విద్యుత్ కార్ల కోసం కూడా గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు రాయితీని అందించే వీలున్నది.

ప్రస్తుతం టాటా మోటార్స్, మహీంద్రా విక్రయిస్తున్న విద్యుత్ ఆధారిత కార్లకైతే సుమారు రూ.1.4 లక్షల మేర సబ్సిడీని పొందవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. గరిష్ఠ రాయితీ వాహన విలువలో 20 శాతం మించరాదని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు వ్యయ కార్యదర్శి ఏఎన్ ఝా నేతృత్వంలో ఇటీవల జరిగిన ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ సమావేశంలో ప్రతిపాదించారు. దేశంలో హైబ్రిడ్, విద్యుత్ వాహనాల వినియోగం, తయారీని వేగవంతం చేయాలన్న ఫేమ్-2 రెండో దశలో భాగంగా ఈ సిఫార్సులు వచ్చాయి.

ఈ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకానికి గతంతో పోల్చితే నిధులను రూ.4,000 కోట్ల నుంచి రూ 5,500 కోట్లకు పెంచాలని కమిటీ నిర్ణయించింది. అయితే వీటన్నిటిపై కేంద్ర క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఫేమ్-1 కేటాయింపులు రూ.700 కోట్లుగానే ఉన్న విషయం తెలిసిందే.

పెరిగిన డీజిల్, పెట్రోల్ ఆధారిత వాహనాల వినియోగంతో పర్యావరణానికి ఏర్పడుతున్న తీవ్ర ముప్పు దృష్ట్యా కాలుష్య రహితమైన విద్యుత్ ఆధారిత వాహనాల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఎల్రక్ట్రిక్ వాహనాలతో దేశీయ దిగుమతుల్లో అధికంగా ఉన్న ముడి చమురు చెల్లింపులనూ తగ్గించుకోవచ్చన్నది ప్రభుత్వం భావిస్తున్నది. ఫలితంగా కరెంట్ ఖాతా లోటూ అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నారు.