ప్యాకేజీని అప్పుడు స్వాగతించి.. ఇప్పుడు డ్రామాలా?

ఆంధ్రప్రదేశ్‌కు ఏన్డీయే ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ గుర్తు చేశారు. పార్లమెంట్‌లో తెలుగుదేశం సభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న కేంద్రమంత్రి విలేఖరులను పిలిపించుకుని మాట్లాడుతూ తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుల తీరును మంత్రి తప్పుబట్టారు.

ఏపీకి హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారని  స్పష్టం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు డ్రామాలు చేస్తున్నారని అంటూ నిరసన చేస్తున్న వారిని ఉద్దేశించి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఇపుడు టిడిపి ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారని గోయల్ మండిపడ్డారు. ‘‘దేశం, ప్రజలను తప్పుదోవ పట్టించాలని టిడిపి ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించి ప్రయోజనాన్నిచ్చే ప్యాకేజీ ప్రకటించాం. దీన్ని చంద్రబాబు స్వాగతించి అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు’’ అని మంత్రి పేర్కొన్నారు. అన్ని విధాలా ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. 

అప్పుడు ప్యాకేజీని స్వాగతించి సంబరాలు చేసుకున్న ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఆందోళనలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పినట్లే ఏపీలో కూడా ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చేప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి హెచ్చరించారు. విశాఖ రైల్వేజోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.