నేడే పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లు

పౌరసత్వ (సవరణ) బిల్లు-2016కు కేంద్ర మనత్రివర్గం సోమవారం ఆమోదం తెలపడంతో మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. మరోవంక పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి, సామాజిక, సాంస్కృతి సంఘాలు బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాం బంద్‌కు పిలుపునిచ్చాయి. బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలోని బీజేపీ సర్కార్ నుంచి అసోం గణపరిషద్ వైదొలిగింది.

బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ బిల్లు ముసాయిదాకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ బిల్లుపై 2016లో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇచ్చిన నివేదికను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఈ బిల్లు తెస్తామని వాగ్దానం చేసింది.  ఈ బిల్లును మేఘాలయ, మిజోరం ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ ఇప్పటికే తీర్మానం ఆమోదించాయి. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందకపోతే మరో ఐదేండ్లలో అసోంలోని హిందువులు మైనారిటీలుగా మారిపోతారని ఆ రాష్ట్ర మంత్రి హిమాంత బిశ్వశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు అసోం మరో కశ్మీర్‌గా మారాలని కోరుకుంటున్న వారి పన్నాగాలు సఫలమవుతాయని హెచ్చరించారు. అసోం చరిత్ర గురించి తెలియనివారే తనను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు.

 బిల్లులోని పలు నిబంధనలను జేపీసీలోని ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యతిరేకించినప్పటికీ కమిటీలోని మెజారిటీ సభ్యుల ఆమోదంతో నివేదికను రూపొందించారు. మూడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని జేపీసీ తన నివేదికలో పేర్కొంది.

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసోం గణపరిషత్ (ఏజీపీ) పార్టీ అసోంలోని బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టవద్దని ఏజీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి అతుల్ బోరా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకొని విజ్ఞప్తి చేశారు. కానీ వీరి విజ్ఞప్తిని బేఖాతరు చేసిన రాజ్‌నాథ్ బిల్లును లోక్‌సభలో ఆమోదం పొందేలా చూస్తామని స్పష్టం చేశారు. దీంతో ఇక తాము బీజేపీతో కలిసి సాగడంలో అర్థం లేదని బోరా పేర్కొన్నారు.