బిజెపితో పొత్తుకు స్టాలిన్ ముందడుగు !

మారిన రాజకీయ పరిస్థితులలో తమిళ్ రాజకీయాలలో తన ఆధిపత్యం ఏర్పరచు కోవడం కోసం బిజెపితో పొట్టు కోసం డిఎంకె కార్యనిర్వాహక అద్యక్షుడు యం కే స్టాలిన్ ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పొత్తును తెంచుకొని బిజెపితో చేతులు కలపడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 30న చెన్నైలో డీఎంకే తలపెట్టిన కరుణానిధి స్మారక సభకు బీజేపీ అద్యక్షుడు అమిత్‌షాను ఆహ్వానించడం, ఆయన అందుకు అంగీకరించడంతో ఈ విషయమై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు భావించవలసి వస్తున్నది.

గత జూన్ 3న జరిగిన కరుణానిధి 93వ జన్మదినోత్సవ వేడుకలకు అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి బిజెపి నుండి మాత్రం ఎవ్వరిని ఆహ్వానించలేదు. తమ రెండు పార్టీల మధ్య సైద్దంతికంగా ఉన్న విబెదాలే అందుకు కారణం అని స్టాలిన్ అప్పట్లో చెప్పారు. మరి ఇప్పుడు మూడు నెలలకే బిజెపి పట్ల ఆ పార్టీ ధోరణి మారడం గమనార్హం.

మరోవంక అన్నాడిఎంకేతో పొత్తు కోసం ప్రయత్నించిన బిజెపి ఆ పార్టీలో నెలకొన్న కుమ్ములాటలు, వేగంగా ఆ పార్టీ నేతలు ప్రజాదరణను కోల్పోతున్నట్లు స్పష్టం అవుతూ ఉండడంతో మరో బలమైన పొత్తుకోసం బిజెపి సహితం ఎదురు చూస్తున్నది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పెర్పాటు చేయబోయే పార్టీతో పొత్తు కోసం బిజెపి నాయకత్వం ఆసక్తి చూపినా ఈ విషయమో రజనీకాంత్ ధోరణి స్పష్టంగా లేక పోతూ ఉండడంతో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నది.

గత నవంబర్ లో ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా కరుణానిధి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యాన్ని పరామర్శించడం, ఆయన మృతి సందర్భంగా నివాళులు అర్పించడానికి చెన్నైకి వచ్చిన సమయంలో ఆయన కుటుంభ సభ్యులు అందరిని పలకరించడం, మరోవంక వాజపేయి మృతి సందర్భంగా వాజ్‌పేయి భౌతికకాయాన్ని స్టాలిన్‌ సందర్శించడం... అంతా చూస్తుంటే రెండు పార్టీల మధ్య సయోధ్యకు మార్గం ఎర్పడుతున్నట్లు వెల్లడి అవుతున్నది.

ఇట్లా ఉండగా, ప్రస్తుతం డిఎంకెకు మిత్రపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ కరుణానిధి సంస్మరణ సభకు రాహుల్ గాంధీ రాకుండా తమ పార్టీ ప్రతినిధిగా గులాం నబి ఆజాద్ ను పంపుతున్నారు. నరేంద్ర మోడీ కరుణానిధి ఇంటికి వెళ్ళినప్పటి నుండి డిఎంకెతో పొత్తు కొనసాగడం పట్ల కాంగ్రెస్ అనుమానాస్పదంగానే వ్యవహరిస్తున్నది.

బిజెపి వ్యూహాత్మక మద్దతు లేకుండా ప్రస్తుతం అన్నాడిఎంకే ప్రభుత్వం కొనసాగడం దుర్లభమని, తాము బిజెపితో చేతులు కలిపితే ప్రస్తుత ప్రభుత్వం పడిపోయి అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు అనీవార్యం కాగలవని కుడా స్టాలిన్ అంచనా వేస్తున్నారు. ఆ విధంగా జరిగితే తాను ముఖ్యమంత్రి కావచ్చని భావిస్తున్నారు.

డిఎంకెతో పొత్తు ఏర్పడితే దక్షిణాదిన బలమైన అదను వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి దొరికిన్నట్లవుతుందని, ఉత్తరాదిన ప్రస్తుతం ఉన్న కొన్ని సీట్లను కోల్పోయినా ఆ మేరకు దక్షిణాదిన భర్తీ చేస్తుకోవచ్చని బిజెపి నేతలు సహితం అంచనా వేస్తున్నారు.