ఢిల్లీలో 5 వేల కిలోల మహా కిచిడి

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం కిచిడీ ఘుమఘుమలతో అలరారింది. ప్రజలతో కిటకిటలాడింది. దళితులు, వెనుకబడిన వర్గాలకు మరింత చేరువయ్యేందుకు బీజేపీ భీమ్ మహాసంగమ్ పేరుతో ఆదివారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా 5వేల కిలోల కిచిడీని తయారుచేసింది. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సమాయత్తమవుతున్నది. 

ఢిల్లీలోని సుమారు మూడు లక్షల మంది దళితుల ఇండ్ల నుంచి సేకరించిన ఆహార పదార్థాలతోనే కిచిడీని తయారుచేయడం గమనార్హం. ఈ భారీ కిచిడీకి సంరస్త కిచిడీ అని నామకరణం చేశారు. మహా కిచిడీ తయారీకి 400 కిలోల బియ్యం, 350 కిలోల కూరగాయలు, 100 కిలోల పప్పు ధాన్యాలు, 100 కిలోల నెయ్యి, 100 లీటర్ల నూనె, 2,500 లీటర్ల నీళ్లు, 250 కిలోల  సుగంధ ద్రవ్యాలను వినియోగించారు. 

ఒకే భారీ పాత్రలో ఈ కిచిడీని వండారు. నాగ్‌పూర్‌కు చెందిన చెఫ్ విష్ణు మనోహర్ దీన్ని తయారుచేశాడు. గతంలో నాగ్‌పూర్‌లో 3వేల కిలోల కిచిడీని తయారుచేసి వరల్డ్ రికార్డును ఆయన నెలకొల్పారు. సమాజంలో వ్యక్తుల మధ్య అంతరాల్ని తొలిగించి, తామంతా ఒక్కటే అనే భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు  మనోజ్ తివారీ చెప్పారు. 25వేలకు మందికిపైగా కిచిడీని ఆరగించినట్లు ఆయన తెలిపారు. 

కేంద్రమంత్రి హర్షవర్ధన్ కూడా పాల్గొన్నారు. బీజేపీ దళిత మోర్చా ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఈ కిచిడీయే ప్రధాన ఆకర్షణ అయింది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీకి వేల మంది దళితులు హాజరయ్యారు.