సీనియర్ మంత్రుల నేతృత్వంలో బిజెపి ఎన్నికల కమిటీలు

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు వేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఆదివారం పలు కమిటీలను ప్రకటించింది.  సీనియర్ మంత్రులతో ఎన్నికలకు సంబంధించి పలు పార్టీ కమిటీలను పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నీయమించారు. 

. 20 మంది సభ్యులు ఉన్న పార్టీ మేనిఫెస్టో కమిటీకి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఆ కమిటీలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మల సీతారామన్, రవిశంకర్‌ ప్రసాద్‌, పీయూష్‌ గోయల్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ, మాజీ ముఖ్యమంత్రి  శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా ఉన్నారు.

ఉత్తర ప్రదేశ్, బీహార్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, సుశీల్ మోదీ,  పార్టీ ప్రధాన కార్యదర్శులు భూపేంద్ర యాదవ్, రామ్ మాధవ్ , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముందే కూడా ఈ కమిటీలో ఉన్నారు. 

8 మంది సభ్యులున్న ప్రచార కమిటీకి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఇన్‌ఛార్జ్‌గా ఉండనున్నారు. ఇందులోనూ పీయూష్‌ గోయల్‌ ఉన్నారు. ఆ పార్టీ మీడియా ప్యానెల్‌ ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యవహరించనున్నారు. ఈ ప్యానెల్‌లో సయ్యద్‌ షాహనవాజ్‌‌ హుసేన్‌ మీనాక్షి లేఖితో పాటు పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

పార్టీ వైపునకు సామాజిక, స్వచ్ఛంద సంస్థలను తీసుకురావడానికి ఏర్పాటు చేసిన బృందానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, పార్టీకి ఉపయోగపడే సాహిత్యం, నినాదాలు అందించే బృందానికి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ నేతృత్వం వహించనున్నారు. మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి, పార్టీకి ఉపయోగపడే సలహాలు ఇచ్చే బృందానికి కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్ అధ్యక్షత వహిస్తారు. 

 ‌కాగా,  ఉత్తర్‌ప్రదేశ్‌ కు జె పి నద్దా, తమిళ్ నాడుకు పీయూష్ గోయల్,  డిల్లీకి నిర్మల సీతారామన్, హర్యానాకు కాల్ రాజ్ మిశ్ర, త్రిపురకు అవినాష్ రాయి ఖన్నా, కర్ణాటకకు పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు,  పుదుచ్చేరి, అండమాన్ నికోబర్ లకు గోయల్ ను పార్టీ లోక్‌సభ ప్రచార ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు.