డీఆర్‌డీవో చీఫ్‌గా డాక్టర్ సతీశ్ రెడ్డి

ప్రతిష్టాకరమైన రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్‌గా ఆంధ్ర ప్రదేశ్ కు చెందినా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి. సతీశ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ళు కొనసాగుతారు. గత మే లో పదవి విరమణ చేసిన ఎస్‌.క్రిస్టోఫర్‌ స్థానంలో నీయమించారు.

డాక్టర్ సతీశ్ రెడ్డి ప్రస్తుతం రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆయనను రక్షణ పరిశోధన, భివృద్ధి శాఖ కార్యదర్శిగానూ, డీఆర్‌డీవో చైర్మన్‌గానూ నియమించేందుకు మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

డాక్టర్ రెడ్డి క్షిపణుల శాస్త్రవేత్త. వ్యూహాత్మక క్షిపణుల విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు డీఆర్‌డీవో హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ గా వ్యవహరించారు.  సతీష్‌రెడ్డిమిస్సైల్స్‌ సిస్టమ్‌లో పరిశోధన చేసి ఎంతగానో ఖ్యాతి గడించారు. 

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ఒక  వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన అనంతపురం జేఎన్‌టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌ జేఎన్‌టీయూ నెంచి ఎంఎస్‌, పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు.

1985లో డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరారు. శిక్షణ తర్వాత హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్‌డీఎల్‌)లో చేరారు. భారత క్షిపణి పితామహుడు అబ్దుల్‌ కలాం.. సతీశ్‌ రెడ్డిని ఏరికోరి నేవిగేషన్‌ విభాగంలో నియమించారు. కలాం కలల రూపమైన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ, హైదరాబాద్‌)లో చేరారు.

కలాం మార్గదర్శకంలో సతీశ్‌రెడ్డి సమీకృత నిర్దేశ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (ఐజీఎండీపీ)లో చురుగ్గా పాలుపంచుకున్నారు. అగ్ని-1, 2, 3, 4, 5, పృథ్వి, ధనుష్‌, అస్త్ర, ఆకాశ్‌, బ్రహ్మోస్‌, నిర్భయ్‌, హెలీనా, నాగ్‌, ఎంఆర్‌ శామ్‌ వంటి క్షిపణుల్లోని కీలక వ్యవస్థలను అభివృద్ధి చేశారు. వ్యూహాత్మక ఆయుధాలు, గైడెడ్‌ వెపన్స్‌, ఏవియానిక్స్‌ టెక్నాలజీ రూపకల్పనలో విశేష అనుభవం గడించారు.

2013లో మే 1న ఆర్‌సీఐకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2014 సెప్టెంబర్‌లో విశిష్ఠ శాస్త్రవేత్తగా ఆయనకు పదోన్నతి లభించింది. 2015 మే నెలలో రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా నియమితులయ్యారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల విభాగం అధిపతి హోదాలో (డీజీ, ఎంఎస్‌ఎస్‌) అనేక అధునాతన ఆయుధాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.