చంద్రబాబు ఆత్రుత కుమారుడి భవిష్యత్ కోసమే

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ భవిష్యత్ కోసం పని చేస్తున్నారే తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ప్రధాన మంత్రి  నరేంద్రమోదీ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలతో ఆయన దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడికి పదవులిచ్చి ఆయన ఎదుగుదలకు ఉపయోగపడ్డారే తప్ప... రాష్ట్ర అభివృద్ధి పట్టడం లేదని ప్రధాని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్ధితి లేదని స్పష్టం చేశారు. ఏపీలో కుల రాజకీయాలు, అవినీతిని అంతమొందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ఎన్డీయే పథకాలను క్షేత్రస్ధాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి అధిక నిధులు ఇచ్చామని, కానీ  వాటిని ఎలా వినియోగించారో కూడా అడగలేదని  ప్రధాని ధ్వజమెత్తారు.  రాష్ట్రం పంపే ప్రతి బిల్లుకు నిధులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో శాంతి భధ్రతలు సరిగా లేవని విమర్శించారు. కాకినాడలో బిజెపి మహిళా కార్యకర్తపై సీఎం దురుసుగా ప్రవర్తించారని బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రధాని కేరళలో కూడా పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 

నాయకులు ఎప్పుడైతే సహనం కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు దిగుతారో ..అప్పుడే వారిలో ఓటమి భయం పట్టుకున్నట్లని ప్రధాని మండిపడ్డారు. దాడులకు పార్టీ శ్రేణులు భయపడాల్సిన పనిలేదని అంటూ దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు బిజెపి  సొంతమని ప్రధాని పేర్కొన్నారు.