శబరిమల ఉద్రిక్తతలపై నివేదిక కోరిన కేంద్రం

శబరిమల అయ్యప్పస్వామిని ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్న అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. బిజెపి, సీపీఎం నేతల ఇళ్లపై జరిగిన దాడులకు దారి తీసిన పరిస్థితులు కూడా నివేదికలో ఉండాలని సూచించింది.

 రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక ఘటనలు, ఆస్తి నష్టాలకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు కోరిన గవర్నర్‌ పి.సదాశివం‌ శనివారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని వివరించారు.

మరోవైపు ఉద్రిక్తతను నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్న బిజెపి  వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కొట్టిపారేశారు. 

కొన్ని గ్రామీణ ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని చోట్ల బుధవారం నుంచి ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అల్లర్లకు పాల్పడుతున్నారన్న అనుమానంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,282 మందిని అరెస్టు చేసినట్లు శనివారం పోలీసులు ప్రకటించారు.