15న కేరళలో ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కేరళలో జరుపనున్న పర్యటన వాయిదా పడినా, ఈ నెలలోనే రెండు సార్లు తిరిగి పర్యటన జరుపనున్నారు. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు  దృష్ట్యా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బిజెపి  అధినాయకత్వం కదులుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి  జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు కేరళలో పర్యటించి, బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 

జనవరి 15న కొల్లాం వేదికగా జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర నిధులతో నిర్మించిన కొల్లాం బైపాస్‌ రహదారిని ఆయన ప్రారంభిస్తారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆ తర్వాత జనవరి 27న మరోసారి త్రిస్సూర్‌ వేదికగా భారతీయ జనతా యువ మోర్చా కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క ఫిబ్రవరిలో అమిత్‌షా కేరళలో వివిధ బహిరంగ సభల్లో పాల్గొంటారనిచెబుతున్నారు.  రాష్ట్రంలో మోదీ, అమిత్‌షాల పర్యటనలతో బిజెపి  కార్యకర్తల్లో నూతనోత్తేజం వస్తుందని, శబరిమల అంశంలోనూ పార్టీ వర్గాలు చురుగ్గా పాల్గొంటాయని భావిస్తున్నారు.