ప్రొటెం స్పీకర్‌ ఉండగా అసెంబ్లీ అడుగు పెట్టను

ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే  ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు బాధ్యతలు అప్పగించడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా ఉన్న సమయంలో తను అసెంబ్లీకి వెళ్లేది లేదని ప్రకటించారు. సీఎం కేసీఆర్ తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సూచించారు. 

సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తెలంగాణకు ఎంతో మంచిదని హితవు చెప్పారు. హిందువులను అవమానించి, ‘వందేమాతరం’ పలకని, ‘భారత్ మాతాకీ జై’ అనని వాళ్ల పార్టీ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించడంపై మండిపడ్డారు. 

‘సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని తను తీసుకున్నారు.. ఇప్పుడు నా నిర్ణయాన్ని నేను తీసుకున్నాను’’ అని చెప్పారు. రాజ్యాంగ నిపుణులతో మాట్లాడి తన తర్వాతి నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. ఓ వీడియో సందేశం విడుదల చేసిన రాజాసింగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.   

ప్రొటెం స్పీకర్‌ ఉన్న సమయంలో తనకు అసెంబ్లీలో అడుగు పెట్టానని, శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం కూడా చేయబోనని రాజాసింగ్ స్పష్టం చేశారు. స్పీకర్ ఎన్నిక తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు.  కొత్త స్పీకర్‌ ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని రాజాసింగ్‌ తెలిపారు.  ప్రొటెం స్పీకర్‌ నియామకంతో తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఎంఐఎంకు లభిస్తున్న ప్రాధాన్యత వెల్లడి అవుతుందని విమర్శించారు.