మరో సారి భారీ మెజార్టీతో బిజెపి ప్రభుత్వం

బిజెపి మరోసారి భారీ మెజార్టీతో గెలిచి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.  త్రిపురలోని అగర్తలాలో తమ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాలగొంటూ ప్రధాన మోదీ ప్రభుత్వం మంచి పరిపాలనను అందించింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. మోదీపై ప్రజలకు నమ్మకం ఉందని తెలిపారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 25 స్థానాల్లో 21 బిజెపికే దక్కుతాయి. త్రిపురలోని 2 స్థానాల్లో గెలుస్తామని భరోసా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో.. కేంద్రంలో తమ పార్టీ నేతృత్వంలో ఏర్పడే శక్తిమంతమైన ప్రభుత్వం కావాలో లేక మహాకూటమి నేతృత్వంలో ఏర్పడే నిస్సహాయ సర్కారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని పిలుపిచ్చారు. 

ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల యోజన, ఆయుష్మాన్‌ భారత్‌, సౌభాగ్య వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను నమ్ముకుని తాము లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నామని అమిత్ షా వెల్లడించారు. 10 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ చేయలేని పనులెన్నో చేశామని తెలిపారు.  సొంత ప్రయోజనాల కోసమే మహాకూటమి ఏర్పాటవుతోందని దుయ్యబడుతూ దానికి ఓ విధానంగానీ, నాయకుడు గానీ లేరని ధ్వజమెత్తారు. 

బీజేపీ మాత్రమే దేశంలో శక్తిమంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని అమిత్‌ షా స్పష్టం చేశారు. మరోవైపు, తాము పశ్చిమ్‌ బంగాలోని 42 సీట్లలో 23 స్థానాలు గెలుచుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.