ట్రంప్‌ మెడ మీద అభిశంసన కత్తి !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెడ మీద అభిశంసన కత్తి వేళ్లాడుతున్నట్లు కనిపిస్తున్నది. ట్రంప్‌ ఎదుర్కొంటున్న న్యాయ వివాదాలు ఆయన పదవికే ఎసరు పెట్టేవైపు దారితీయోచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.  మరోసారి ట్రంప్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న చర్చ మొదలైంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సాగుతున్న విచారణలో భాగంగా ట్రంప్‌ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ , ప్రచార మాజీ మేనేజర్‌ పాల్‌ మనాఫోర్ట్‌ లు కోర్టుల్లో దోషులుగా తేలడం ఒక్కసారిగా ట్రంప్‌ను చిక్కుల్లోకి నెట్టేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన  సెక్స్‌ స్కాండల్‌  ముడుపుల వ్యవహారం ఇప్పుడు వెలుగుచూడడంతో ట్రంప్‌ ఎన్నడూ లేనివిధంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.

 ట్రంప్‌ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ పన్నుల ఎగవేత, బ్యాంకుల్ని మోసగించడం, ప్రచార ఆర్థిక చట్టాల ఉల్లంఘన నేరాలను కోర్టు ఎదుట అంగీకరించడం ట్రంప్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. పైగా, ట్రంప్‌తో తమకు లైంగిక సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న ప్లేబాయ్‌ మోడల్‌ కరెన్‌ మెక్‌ డౌగల్, పార్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్‌లు నోరు మూయించడానికి మూడో కంటికి తెలీకుండా ముడుపులు చెల్లించాలని  ట్రంప్‌ తనకు చెప్పారంటూ కోహెన్‌ కోర్టుకు వెల్లడించారు. ఇవన్నీ ఇప్పుడు ట్రంప్‌ను గద్దె దింపుతారా అన్న చర్చకు దారి తీశాయి.  

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఎఫ్‌బిఐ ప్రత్యేక న్యాయవాది రాబర్ట్‌ ముల్లర్‌ చేస్తున్న విచారణలో వెల్లడవుతున్న నిజాలు, తాజా పరిణామాలు ట్రంప్‌ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. రాజకీయంగానూ ఆయనకు తీవ్ర నష్టం జరుగుతోంది. నవంబర్‌లో జరిగే ప్రతినిధుల సభ ఎన్నికలే ట్రంప్‌పై అభిశంసనకు ఒక రిఫరెండంలా మారవచ్చని భావిస్తున్నారు. ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజార్టీ. డెమొక్రాట్లు రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రతినిధుల సభలో పట్టు పెంచుకుంటే ట్రంప్‌ను పదవి నుంచి తప్పించే ఎత్తుగడలను ఉధృతం చేసే అవకాశం ఉంది.

ట్రంప్‌ సైతం తనను అభిశంసిస్తే మార్కెట్లు కుప్పకూలి అందరూ పేదవాళ్లయిపోతారని బెదిరించడం ఆయనలో నెలకొన్న అసహనాన్ని వెల్లడి చేస్తున్నది.  అయితే అమెరికా అధ్యక్షుడిని అభిశంసించాలంటే  సుదీర్ఘమైన ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభలో సభ్యులెవరైనా అధ్యక్షుడి తప్పుల్ని ఎత్తి చూపుతూ అభిశంసనకు ప్రతిపాదించవచ్చు. దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, ఘోరమైన నేరానికి పాల్పడడం, దుష్ప్రవర్తన (అధికార దుర్వినియోగం, ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీయడం దుష్ప్రవర్తన కిందకి వస్తాయి)  వంటి కారణాలతో అభిశంసించే అవకాశం ఉంది.

ప్రతినిధుల సభలో అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా  హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ ఎదుట విచారణకు వస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆ కమిటీ విచారణలో ఆరోపణలు నిజమేనని తేలితే ఏయే ఆర్టికల్స్‌ కింద నేరారోపణలు చేశారనేది నిర్ధారిస్తారు. ఆ ఆర్టికల్స్‌పై మళ్లీ సభలో సమగ్రమైన చర్చ జరిగి ఓటింగ్‌ జరుగుతుంది. సాధారణ మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని సభ ఆమోదిస్తే, దానిని సెనేట్‌కు పంపుతారు.

అక్కడ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు ఎవరూ అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్‌ క్లింటన్‌లపై  ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గినప్పటికీ, సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో వాటర్‌గేట్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రిచర్డ్‌ నిక్సన్‌ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.