మిషెల్‌‌కు కాంగ్రెస్ అత్యున్నత నేతలతో సంబంధం

అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందం మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత స్థాయి నేతలతోనూ, అప్పటి మంత్రులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, బహుశా మధ్యవర్తికి ప్రధాన మంత్రి (మన్మోహన్ సింగ్)కి తెలిసినదాని కన్నా ఎక్కువ సమాచారం తెలిసినట్లు ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి, మధ్యవర్తుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల పాత్రపై దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతాయని స్పష్టం చేశారు. 

ఒడిశాలోని బారిపదలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ   అగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసును ప్రస్తావిస్తూ 2004 నుంచి 2014 మధ్య కాలంలో (యూపీయే ప్రభుత్వ హయాంలో) మన దేశ సైన్యాన్ని బలహీనపరిచే కుట్ర జరిగిందని మండిపడ్డారు.

యూపీఏ హయాంలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఫైళ్ల కదిలికల గురించి, రక్షణ రంగంపై ఏర్పాటు చేసిన కమిటీలో చర్చల గురించి ఈ దళారీ మిషెల్ కి పూర్తి సమాచారం ఉందని మోదీ ఆరోపించారు. అంతేకాదు, ప్రతి కీలక ఫైలు సమాచారం ఇతని వద్ద ఉందని ప్రస్తుతం జరుపుతున్న దర్యాప్తులో ఆ వివరాలన్నీ బయటపడుతున్నాయని మోదీ వెల్లడించారు. ఒకరకంగా చెప్పాలంటే అప్పటి ప్రధానమంత్రి కంటే కూడా కాంగ్రెస్ హయాంలో దళారులకే ఎక్కువ కీలక సమాచారం తెలుసునన్న విషయం స్పష్టమవుతుందని చెప్పారు.

రక్షణ, భద్రత, ఆయుధ సేకరణకు సంబంధించిన వివరాలను ఈ దళారులు విదేశాలకు అందజేసిన సంకేతాలు కూడా ఉన్నాయని మోదీ తెలిపారు.   ప్రభుత్వాన్ని నడిపినది కాంగ్రెస్సా? లేదంటే మిషెల్ మామగారి దర్బారా? అన్నది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. చట్టం ఎవరినీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు.  ఇపుడు ఆ పాలనలోని వాస్తవాలు ఒకటొక్కటిగా వెలుగు చూడడంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నిద్రపట్టడంలేదని ఎద్దేవా చేశారు. 

దేశ భద్రత కోసం తన ప్రభుత్వం ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ‘మధ్యవర్తులను రక్షించడంలో అప్పటి పాలకుల పాత్ర ఏమిటి అన్నది నిగ్గు తేలుస్తాం’ అని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పరిణామాలను దేశమంతా గమనిస్తోందని, అర్థం చేసుకుంటోందని పేర్కొన్నారు. వలలో నుంచి బయటికి రావడానికి మన సైన్యానికి తన ప్రభుత్వం సహాయపడుతోందని భరోసా ఇచ్చారు. 

‘కాపలాదారు దొంగ’ అంటూ ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ దొంగలే కాపలాదారు పోవాలని కోరుకుంటారని ప్రధాన మంత్రి  ధ్వజమెత్తారు. గత నాలుగున్నరేళ్లుగా దేశానికి చౌకీదారుగా పనిచేస్తున్న తనను తొలగించాలన్న డిమాండ్‌తోనే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. ‘దొంగలే చౌకీదారును తొలగించాలని అనుకుంటారు’ అంటూ వ్యంగ్యోక్తి విసిరారు. 

దేశ రక్షణ, ప్రజల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న చౌకీదారును ఎలాగైనా తొలగించాలన్నదే కాంగ్రెస్ ధ్యేయంగా పనిచేస్తోందని మోదీ విమర్శించారు. సమాజంలోగానీ, ఫ్యాక్టరీల్లోగానీ దొంగల ఏకైక ధ్యేయం ఎలాగైనా చౌకీదారును తొలగించి చొరబడి దోచుకోవాలన్నదని మోదీ ఎద్దేవా చేశారు. అయితే ‘ఈ చౌకీదారు ఉన్నంతవరకు ఆ దొంగల ఆటలు సాగవు. వారి కుట్రలు నెరవేరవు’ అని హెచ్చరించారు.  సాయుధ దళాలకు, చివరికి రక్షణకే రక్షణ లేకుండా చేసిన కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశం ఇవ్వాలా అంటూ జనాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు.