రుణ మాఫీ హామీతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌

రైతులను ఓటు బ్యాంకుగా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ పేరుతో వారిని తప్పుదారి పట్టిస్తోందని ప్రధాన మంత్రి మోదీ విమర్శించారు. శనివారం ఝార్ఖండ్  రాష్ట్రం పాలము జిల్లాలోని మండల్ డ్యాం సహా ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ప్రధానమంత్రి గృహ ఆవాస యోజన కింద ఐదుగురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ  రైతు రుణమాఫీ పేరిట ఓటుబ్యాంకు  రాజకీయాలు చేయడాన్ని మోదీ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీకి రైతులు వోటు బ్యాంకు మాత్రమేనని కాని తమకు మాత్రం ఆహార ప్రదాతలని చెప్పారు. కాంగ్రెస్‌కు, బిజెపి మధ్య తేడా ఇదేనని ఆయన పేర్కొన్నారు.

 రైతుల వోట్లే కావాలనుకుంటే నేను కూడా రుణ మాఫీ కింద లక్ష కోట్ల రూపాయలు ప్రకటించేవాడిని. అది చాలా సులభం కూడా. కాని మేము ఆ పని చేయలేదు. పాత విధానాన్ని మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము అని మోడీ వ్యాఖ్యానించారు.

‘‘నేను కూడా రైతులను ఓటు బ్యాంకుగా భావించి ఉంటే రూ.లక్ష రుణాన్ని మాఫీ చేసి ఉండేవాడిని. అది వారికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది. తరతరాలకు లబ్ధి చేకూర్చే సౌకర్యాలను కల్పించి, తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మా ప్రాధాన్యం’’ అని చెప్పారు.   

రుణమాఫీ ద్వారా కాకుండా ఇతర పద్ధతుల ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సించాయ్ పరియోజన కింద 99 శాతం పనులు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు.2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల పునరుద్ధరణపై దృష్టి సారించామని మోడీ చెప్పారు.

 ప్రధానమంత్రి ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించి గడచిన 30-40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 99 ఇరిగేషన్ ప్రాజెక్టులను పునరుద్ధరించామని ప్రధాని  వివరించారు. ఈ ప్రాజెక్టులపై దాదాపు రూ.90,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన చెప్పారు.

 ‘ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే రైతులు లబ్ధి పొంది ఉండేవారు. రుణాలు తీసుకోవాల్సిన అవసరం వారికి ఉండేది కాదు. తొలుత రుణాలు తీసుకోవాలని రైతులను బలవంతం చేసి, ఇప్పుడు రుణ మాఫీ పేరుతో వారిని తప్పుదారి పట్టిస్తున్నారు’ అని ప్రధాని ఆరోపించారు.

ఇళ్ల నిర్మాణ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ప్రధాని పేరుతోనే తాము పథకం అమలు చేస్తున్నామని, తదుపరి ప్రధాని కూ డా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని చెప్పారు. కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రజలకు 1 కోటి 25 లక్షల ఇళ్లు ఇచ్చిందని మోదీ స్పష్టం చేశారు.