17 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

 తెలంగాణ శాసనసభ జనవరి 17న కొలువుదీరనుంది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, అధికారులతో శనివారం ప్రగతి భవన్‌లో సమావేశమైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈనెల 17 నుంచి 20 వరకూ నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

జనవరి 16న సాయంత్రం 5గంటలకు ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌.. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో ప్రమాణం చేయిస్తారు. 17న శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. 119 మంది నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండుగంటలు కొనసాగుతుంది. ఆ తర్వాత జూబ్లీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్ లో శాసనసభ సభ్యులకు లంచ్ ఉంటుంది.  

17వ తేదీన స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు కూడా వుంటాయి. 18వ తేదీన స్పీకర్ ఎన్నిక, ఎన్నికైనట్లు ప్రకటన వుంటాయి. ఆ తరువాత నూతనంగా ఎన్నికైన స్పీకర్ ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభా పక్ష నాయకులు స్పీకర్ స్థానానికి తోడ్కొని పోతారు. 

అనంతరం నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. ఆ తర్వాత స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు.  19న శాసనసభ, శాసనమండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగిస్తారు. 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది.