యుపిలో కాంగ్రెస్ కు మాయావతి, అఖిలేష్ ఝలక్

లోక్ సభ ఎన్నికలలో కీలకమైన ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. వారిద్దరూ ఢిల్లీలో సమావేశమై రాష్ట్రంలో ఇద్దరం సీట్లు సర్దుబాటుకు ఒక అవగాహనకు వచ్చారు. అందులో కాంగ్రెస్ ను పక్కన పెట్టేసారు. 

రాష్ట్రంలో మొత్తం 80 సీట్లు ఉండగా చెరో 37 సీట్లకు పోటీ చేయాలని అవగాహనకు వచ్చారు. మిగిలిన ఆరు సీట్లను చిన్న పార్టీలకు వదిలేయనున్నట్లు తెలుస్తోంది. అజిత్ సింగ్ నాయకత్వంలోని ఆర్ ఎల్ డి కి మూడు సీట్లు వాడాలి అవకాశం ఉంది. అదే విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లకు పోటీ పెట్టె అవకాశం లేదు. 

అయితే కాంగ్రెస్‌ పార్టీపై అఖిలేశ్‌, మాయావతి అసంతృప్తిగా ఉన్నారని, దీంతో యూపీ మహాకూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోవాలని వారు భావించట్లేదని సదరు వర్గాలు చెబుతున్నాయి.

కాగా.. సీట్ల పంపకాలపై ఎస్పీ, బీఎస్పీలు జవనరి 15 తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఒకవేళ మహాకూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోకపోతే అమేథీ, రాయ్‌బరేలీలో ఎవర్నీ బరిలోకి దించాలన్నది ఎస్పీ, బీఎస్పీలకు కాస్త కష్టమైన విషయమే.

అయితేబిజెపికి  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలతో కూటమికి రంగం సిద్ధం చేస్తున్న కాంగ్రెస్‌కు మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడటం ఒక విధంగా షాక్ కలిగించినట్లు అవుతుంది. 

 ఇటీవల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మెజార్టీ దక్కలేదు. దీంతో సమాజ్‌వాదీ పార్టీ మద్దతులో కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే సీఎం కమల్‌నాథ్ మంత్రివర్గంలో సమాజ్‌వాదీ పార్టీకి చోటు దక్కకపోవడంపై అఖిలేశ్‌ యాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

గతవారం అఖిలేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ఎమ్మెల్యేను మంత్రిని చేయలేదు. కాంగ్రెస్‌కు ధన్యవాదాలు’ అంటూ చురకలంటించారు. అటు మాయావతి కూడా కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అంశాన్ని పునఃపరిశీలిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో యూపీ లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమిలో కాంగ్రెస్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.