మినీ జమిలి ఎన్నికలకు బిజెపి సిద్దం !

ఇంకా చట్టపరమైన సన్నాహాలు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం జమిలి ఎన్నికలు జరపడం సాధ్యం కాదని పరిమితంగా అయినా లోక్ సభ, వీలయినన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగే విధంగా చూడాలని బిజెపి సిద్దపడుతున్నది. డిసెంబర్ లో ఎన్నికలు జరుగవలసిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీలకు అక్టోబర్ లోనే ఎన్నికల కమీషన్ ప్రకటన చేయవలసి ఉంటుంది. దానితో ఈ ఎన్నికలను రెండు, మూడు నెలలపాటు వాయిదా వేసేటట్లు చేసి, లోక్ సభ ఎన్నికలను రెండు, మూడు నెలల పాటు ముందుకు తీసుకు రావడం ద్వారా చేస్తే వచ్చే ఏడాది మొదట్లో 10 నుండి 12 అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ విషయమై వచ్చే నెల మొదట్లో ఢిల్లీలో జరుగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు సుముఖంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయంతో సంబంధం లేకుండా లోక్ సభతో పాటు ఎన్నికలు జరుగవలసిన ఆంధ్ర ప్రదేశ్, ఓడిస్సా వంటి అసెంబ్లీలకు సహితం ఆరు నెలల లోపు ముందుగా ఎన్నికలు జరిపే సౌలభ్యం ఎన్నికల కమీషన్ కు ఉంటుంది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించే పక్షంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలను కూడా వీటితో కలుపుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వీటితో పాటు వచ్చే ఏడాది మధ్యలో ఎన్నికలు జరుగవలసిన మహారాష్ట్ర, హర్యానా శాసన సభల ఎనికలను కూడా ముందుకు జరిపే అవకాశం ఉంటుంది.

ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగ వలసిన రాస్తాలలో బిజెపి ప్రభుత్వాలు కొంత ప్రతికులతను ఎదుర్కొంటున్న దృష్ట్యా లోక్ సభతో పాటు ఎన్నికలు జరిగితే వాటిని అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటె జాతీయ స్థాయిలో ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ గల నేతగా ఉన్నారు. ప్రతిపక్షాలు ఆయనకు పోటీగా ఎవ్వరిని ప్రజల ముందుకు తీసుకు రావడానికి సిద్దపడటం లేదు. దానితో ప్రతిపక్షాల ఐక్యత చెప్పుకోదగిన సవాల్ విసరలేక పోవచ్చని భావిస్తున్నారు.  పరిమితంగా జమిలి ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమీషన్ కుడా సంశిద్దంగానే ఉండడంతో ఎటువంటి సమస్య ఏర్పడే అవకాశం ఉండక పోవచ్చు.