కన్నా ఇంటిపై టిడిపి శ్రేణుల దాడి...బిజెపి ప్రతిఘటన

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై గుంటూరులో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగడంతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. శుక్రవారం కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ను  బిజెపి కార్యకర్తలు అడ్డుకోవడంతో సహించలేక టిడిపి కార్యకర్తలు కన్నా ఇంటి వద్ద బైఠాయింపు జరిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని కన్నా ఆరోపించారు.

దీన్ని బిజెపి నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో ఈ పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేశారు. బిజెపి  కార్యకర్తలు సైతం రహదారిపై బైఠాయించారు. ఓ దశలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు విరుచుకుపడ్డారు. వెంటాడి తరిమికొట్టారు.

గుంటూరు లోని టిడిపి కార్యకర్తలు కాకూండా  విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు భిత్టాయింపుకు దిగటం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ, కన్నా, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో బిజెపి కార్యకర్తలు ఆగ్రహనికి గురయ్యారు. 

దీంతో టీడీపీ ఆందోళనకారుల ఎదుటే కన్నా కూర్చున్నారు. కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ- బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వివాదం చేటుచేసుకుంది. అనంతరం తోపులాట చేసుకోవడంతో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లారు.

అంతమొందించేందుకు కుట్ర  

తన ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నా చేయడాన్ని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. తనను అంతమొందించేందుకే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులకు భద్రత లేక పోయినదని, వారిపై అధికార పక్షం హత్యాప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. 

గతంలో అమిత్‌షా, జగన్‌, పవన్‌పై ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. గవర్నర్‌ దృష్టిసారించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యమే లేదని, వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని విమర్శించారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని కన్నా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

బిజెపిని అంతం చేస్తామని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని, అందులో భాగంగానే ఈ దాడి జరిపారని ఆరోపించారు. టిడిపి గుండాలకు అడ్డు లేకుండా పోతున్నదని అంటూ వచ్చే ఎన్నికలలో ప్రజలు తగు బుద్ది చెబుతారని హెచ్చరించారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని కన్నా మండిపడ్డారు. తన ఇంటికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని టిడిపి నేతలు చెబుతున్న మాటలను కొట్టి పారవేసారు. వినతి పత్రం ఇవ్వాలి అనుకున్నవారు ముందుగా తన సమయం అడిగి మరీ వస్తారని, పైగా పార్టీ కార్యాలయానైకి వస్తారు గాని ఇంటిపైకి రారని స్పష్టం చేసారు. అదీగాక అలా వచ్చిన వారు తమపై బూతులు తిడతారా అని అడిగారు. 

 కాగా, శుక్రవారం కాకినాడలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన బిజెపి కార్యకర్తల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమర్యాదకరంగా వ్యవహరించారని కన్నా ఆరోపించారు. బిజెపి  మహిళా కార్పొరేటర్‌ను ఫినిష్ చేస్తామని సీఎం హెచ్చరించడాన్ని ఆక్షేపించారు. 

సీఎం ఎక్కడికి వెళ్లినా బిజెపి కార్యకర్తలను అరెస్టులు చేయిస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని కన్నా చెప్పారు.