చంద్రబాబు శ్వేతపత్రాలపై చర్చకు ఉండవల్లి సవాల్

ఏపీ ప్రభుత్వం ప్రకటిస్తున్న శ్వేతపత్రాలన్ని  బూటకమేనని, ప్రభుత్వ ప్రకటనల్లో వాస్తవం ఉంటే అధికారులతో చర్చకు సిద్ధపడాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సవాలు విసిరారు. వాస్తవాలను వెల్లడించేందుకు  శ్వేతపత్రాల  వెల్లడి సంప్రదాయం కొనసాగుతూ వస్తోందని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  వెలువరిస్తున్న  శ్వేతపత్రాలన్ని భూటకాలేనని ఆయన ధ్వజమెత్తారు.  రాజకీయంగా కాకుండా అధికారికంగా ఈ చర్చ జరిగితే మంచిదని అభిప్రాయపడ్డారు. 

శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న ఆయా శాఖలకు సంబంధించి ముఖ్యకార్యదర్శుల సారధ్యంలో ఏ రాజకీయ పార్టీ నాయకులతో కాకుండా, ప్రభుత్వంలో పనిచేసిన రాజకీయ పార్టీలతో సంబంధం లేని మాజీ ఐఏఎస్‌లు, ఇతర మేథావులతో ఈ చర్చ జరిగితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. మొన్నటి వరకూ ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లాం వంటి వారిని పిలిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్టుకు సంబందించి ఏ ఏదాడి మేలో నీళ్లిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఉండవల్లి విమర్శించారు. మండు వేసవి మే నెలలో గోదావరిలో అసలు నీరే ఉండదని, అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఇస్తామంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెపుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతిలో చేపడుతున్న నిర్మాణాలన్నీ తాత్కాలికమేనని, సచివాలయం, అసెంబ్లీ, చివరకు హైకోర్టు భవనం అన్నింటినీ తాత్కాలికంగానే కడుతున్నారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అనుభవించే హక్కు ఉండగా, ఆఘమేఘాలపై అమరావతి వచ్చి తాత్కాలిక భవనాలు నిర్మించుకోవాల్సిన అగత్యం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విశాఖలో మూడు విడతలుగా భాగస్వామ్య సదస్సులు నిర్వహించి రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని ప్రకటించారని గుర్తు చేశారు. దీనిలో వీసమెత్తు వాస్తవం కూడా లేదని స్పష్టం చేశారు. 

ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అడ్డూ ఆదుపులేకుండా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఉండవల్లి ఆరోపించారు. ఆదరణ పనిముట్లు దగ్గర్నుంచి అన్నింటిలోనూ అవినీతి జరుగుతోందని తెలిపారు. ప్రాజెక్టుల్లో కమిషన్లు అవినీతికి పరాకాష్టగా పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనానికి, అన్న క్యాంటీన్ల ద్వారా పెట్టే భోజనానికి చెల్లించే మొత్తానికి మధ్య ఎంతో వ్యత్యాసముందని చెప్పారు. అన్న కేంటీన్‌లో పెడుతున్న భోజనం ద్వారా మధ్యవర్తులు రూ.27 కమిషన్ దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మరోసారి అధికారం చేపడితే ప్రస్తుతం ఉన్న జన్మభూమి కమిటీల మాదిరి ఎమ్మెల్యే కమిటీలను ఏర్పాటు చేసి నియోజకవర్గాలు రాసిచ్చేస్తారేమనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత చంద్రబాబు పరిపాలనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న మీరు కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలపై మాట్లాడకపోవడం అప్పటి ప్రతిపక్ష వైఫల్యంగా పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్ కూడా అదే ధోరణిలో ఉన్నాడని విమర్శించారు. 

రాష్ట్ర విభజన విషయంలో జరిగిన అన్యాయంపై తాను న్యాయస్థానంలో వేసిన కేసులో కేంద్రం ఇప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయలేదని ఉండవల్లి చెప్పారు. దీనిపై రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించాలని తాను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు శూన్యమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటానికి పవన్ తమతో కలిసి రావాలంటూ చంద్రబాబు ఆహ్వానం మైండ్‌గేమ్‌గా పేర్కొన్నారు. 

కేంద్రంపై పోరాడేందుకు రాష్ట్రంలోని బలమైన విపక్షం వైసీపీని టీడీపీ ఎందుకు విస్మరిస్తోందో అర్ధం కావట్లేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చిందని, లేనిపక్షంలో కాంగ్రెస్ 50కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది ఉండేదని ఉండవల్లి చెప్పారు.  కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధుల విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య జరుగుతున్న పరస్పర ఆరోపణలపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే యూసీలను వెబ్‌సైట్‌లో పెడితే అందరికీ వాస్తవాలు తెలుస్తాయని సూచించారు.