నిజమైన అసోం పౌరులెవరినీ ఎన్నార్సీ నుంచి తొలగించం

నిజమైన అసోం పౌరులెవరినీ జాతీయ పౌర రిజిస్టర్ (రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్- ఎన్నార్సీ) నుంచి తొలగించబోమని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. పారసత్వ బిల్లుకు త్వరలోనే పార్లమెంట్ ఆమోదం లభిస్తుందని చెప్పారు. ఈశాన్య భారతంలో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ.. శుక్రవారం సిల్చార్ సమీపంలోని కాలీనగర్‌లో నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభలో మోదీ మాట్లాడారు. 

ఏ ఒక్క భారతీయుడికీ అన్యాయం జరగనివ్వనని భరోసా ఇస్తూ  దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య మీ అందరి(అసోం ప్రజల) త్యాగాల వల్ల కొలిక్కి వస్తున్నదని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియలో ఎలిజిబిలిటీ సర్టిఫికెట్, ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, ఇందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో లక్షల మందికి ప్రయోజనం చేకూరిందని వివరించారు.

పౌరసత్వ(సవరణ) బిల్లు- 2016పై తమ ప్రభుత్వం ముందుకెళుతున్నదని చెప్పారు. ఈ బిల్లు ప్రజల జీవితాలు, భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఇది ఏ ఒక్కరి ప్రయోజనాల కోసం ఉద్దేశించినది కాదు. గత అన్యాయాలకు ఇది ప్రాయశ్చితం లాంటింది అని మోదీ పేర్కొన్నారు. పౌరసత్వ చట్టం-1955లో సవరణలకు ఈ బిల్లును ఇదివరకే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ‘‘భారతమాతపై గౌరవం ఉంటూ ఇతర దేశాల్లో పీడనకు గురవుతున్న వారు ఎక్కడికి వెళ్లాలి? వారిని భారతమాత అక్కున చేర్చుకోకూడదా? విభజన సందర్భంగా జరిగిన అన్యాయాలను సరిదిద్దుకోవడం తప్పనిసరి’’ అని స్పష్టం చేశారు. 

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మైనార్టీలు (హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు) దేశంలో ఆరేండ్లుగా నివసిస్తుంటే, వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అసోంలోని చాలా వర్గాలు, సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అసోం ఒడంబడికకు ఇది విరుద్ధమంటున్నాయి. మరోవైపు అసోం ఒడంబడికలోని ఆరో క్లాజ్ అమలుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోదీ చెప్పారు.

అసోం ప్రజల సామాజిక, సాంస్కృతిక, భాష, వారసత్వ సంపద పరిరక్షణకు దీని ద్వారా మార్గం సుగమమవుతుందని ప్రధాని చెప్పారు. ఈ క్లాజ్ అమలుకు భాగస్వామ్య పక్షాలతో చర్చించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొన్ని పార్టీలు దశాబ్దాల పాటు పాలించినా, అసోం ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించిందని, నిజాయితీని పాదుకొల్పిందని, మధ్యవర్తులను తొలగించిందని వెల్లడించారు. 

కాంగ్రెస్ పార్టీ అన్ని ఒప్పందాల్లో బ్రోకర్లకు భాగస్వామ్యం కల్పించిందని ప్రధాని దుయ్యబట్టారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో నిందితుడు మిషెల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ... అతడిని కలిసేందుకు కాంగ్రెస్ లాయర్లు జైలుకు పరుగెత్తారని, చీటీలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల అసోంలో బోగీబీల్ రోడ్డు-రైలు వంతెనను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. పది రోజుల వ్యవధిలోనే రెండోసారి అసోంకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 

ఇక్కడి బరక్, బ్రహ్మపుత్ర రాష్ట్రానికే  కాకుండా, దేశమంతటికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన అసోం ప్రజలకు తాను రుణపడి ఉన్నానని, రాష్ట్రాన్ని  అభివృద్ధి చేయడం ద్వారా ఆ రుణాన్ని తీర్చుకుంటానని పేర్కొన్నారు.