శివసేనతో అనవసరపు రాజీ లేదని అమిత్ షా స్పష్టం

మహారాష్ట్రలో మిత్రపక్షం ఏకపక్ష ధోరణులను దుయ్యబడుతూ ఆ పార్టీతో అనవసరపు రాజీ ప్రసక్తి లేదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అవసరమైతే రాష్ట్రంలో అన్ని స్థానాలలో సొంతంగా పోటీ చేసేందుకు సిద్దపడలని పార్టీ ఎంపీలకు మార్గనిర్ధేశం చేశారు. 

మహారాష్ట్ర ఎంపీలతో జరిపిన సమావేశం సందర్భంగా  మిత్రపక్షం శివసేనకు ఘాటైన సందేశం పంపారు. కొన్ని నెలలుగా శివసేన బిజెపి  వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీల సమావేశం సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. మిత్ర పక్షం కోసం అనవసరంగా రాజీ పడాల్సిన అవసరం బిజెపికి లేదని స్పష్టం చేశారు. 

వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు శివసేన మారకపోతే మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అమిత్‌ షా అధ్యక్షతన మహారాష్ట్రకు చెందిన పార్టీ ఎంపీల సమావేశం దిల్లీలో జరిగింది. శివసేనతో కలిసి ముందుకెళ్లేందుకు బీజేపీకి  సానుకూలంగానే ఉందని, కానీ సీట్ల సర్దుబాటు విషయంలో వారు ఇబ్బంది పెడుతున్నారని అమిత్‌షా ఎంపీలతో పేర్కొన్నట్లు తెలిసింది.

శివసేనతో పొత్తు లేకపోయినా ఈ సారి ఎక్కువ సీట్లు గెలుస్తామని బీజేపీ నాయకులంతా అభిప్రాయపడినట్లు ఓ ఎంపీ తెలిపారు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఊహించని దానికంటే ఎక్కువ సీట్లు గెలిచినందున.. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే పునరావృతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

బిజెపి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ.. అవసరమైతే తాము ఒంటరిగా ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ఏడాది క్రితం శివసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. రఫేల్ ‌వ్యవహారంపైనా  రాజ్యసభలో ప్రతిపక్షాలతో కలిసి అధికార పక్షానికి వ్యతిరేకంగా శివసేన వ్యవహరించింది.