ఇక కోర్ట్ లలో కుడా ప్రత్యక్ష ప్రసారాలు !

పార్లమెంట్, అసెంబ్లీల కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారాలు ప్రరంభమైనప్పటి నుండి రాజకీయంగా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక విధంగా చట్టసభలలో ఏమి జరుగుతుందో చూసే అవకాశం ప్రజలకు కలుగుతుండగా, మరోవంక సభా కార్యకలాపాలకు అడ్డం కలిగిస్తే తప్ప వార్తలలోకి ఎక్కలేమని తప్పుడు సంకేతాలు ప్రజా ప్రతినిదులకు పంపిన్నట్లు అవుతున్నది. ఇటువంటి సమయంలో కోర్ట్ లలో జరిగే వాదోపవదాలను సహితం ప్రత్యక్ష ప్రసారం చేసే అంశం ఇప్పుడు సుప్రేం కోర్ట్ ముందుకు వచ్చింది. ఈ విషయంలో ఇంకా తుది తీర్పు ఇవ్వవలసి ఉన్నప్పటికీ న్యాయమూర్తులు సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తున్నది.

కోర్టు వ్యవహారాల్లో దాపరికం లేకుండ ఉండటం విధానాన్ని అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రేం కోర్ట్ స్పష్టం చేసింది. కోర్టుల్లో జరిగే వాదనలు, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల సమస్యలు వస్తాయని తాము అనుకోవడం లేదని, ఈ విధానాన్ని అమలు చేయడానికి మొదట పైలట్ ప్రాజెక్టును చేపడుదామని సూచించింది. ఫలితాలను బట్టి ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలా? వద్దా? అన్నది నిర్ణయిద్దాం అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

‘‘కోర్టు గదిలోకి ఎవరైనా ప్రవేశించగలరు. అలాంటప్పుడు విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తే సమస్యేంటి. వాస్తవానికి ఈ ప్రక్రియతో బహిరంగ న్యాయస్థానాలు అందుబాటులోకి వస్తాయి. కోర్టు గదుల్లో జనం మరీ ఎక్కువగా ఉండకుండా ఇది ఉపయోగపడుతుంది’’ అని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియలో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తే.. అయోధ్య, ఆధార్‌ వంటి అంశాల్లో బూటకపు వార్తలు ఎక్కువయ్యే ముప్పుంటుందన్న వాదనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏదో ప్రమాదం జరిగే అవకాశముందన్న అనుమానంతో.. సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకోకుండా తిరస్కరించలేమని స్పష్టం చేసింది. ప్రస్తుతం న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు బయటకొస్తున్నాయని పేర్కొంది.

కాగా, రాజ్యాంగ ప్రాధాన్యత ఉన్న వ్యవహారాలకు సంబంధించి.. సీజేఐ కోర్టులో ప్రయోగాత్మకంగా ప్రత్యక్ష ప్రసారాన్ని చేపట్టవచ్చునని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సూచించారు. ఆ ప్రాజెక్టు విజయవంతమైతే.. దేశవ్యాప్తంగా ఇతర కోర్టుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించవచ్చునని తెలిపారు. ప్రత్యక్ష ప్రసారాన్ని 70 సెకన్లు ఆలస్యంగా నడిపించాలని వేణుగోపాల్‌ అభిప్రాయపడ్డారు. న్యాయవాదులు అనుచితంగా ప్రవర్తించినప్పుడు, జాతీయ భద్రత, వ్యక్తిగత గోప్యత వంటి సున్నితమైన అంశాలపై విచారణ జరిగేటప్పుడు అవసరాన్నిబట్టి కొన్ని మాటలను తొలగించేందుకు ఆ వ్యవధి దోహదపడుతుందని పేర్కొన్నారు.

కక్షిదారులు, పాత్రికేయులు, సందర్శకులు, న్యాయవాదులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా కోర్టు సరిహద్దుల్లో మీడియా గదిని ఏర్పాటుచేయాలని కోరారు. తద్వారా కోర్టు గదుల్లో జనసంఖ్య తగ్గుతుందని వెల్లడించారు. ప్రత్యక్ష ప్రసారం చేయడానికి బదులుగా విచారణ ప్రక్రియను వీడియో తీసి సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని ఓ న్యాయవాది సూచించారు.  కోర్టు వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ న్యాయ విద్యార్థి ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.