సెప్టెంబరు నాటికి తొలి రఫేల్‌ యుద్ధ విమానం

 భారత్‌ కొనుగోలు చేసిన తొలి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని, మిగిలిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2022 నాటి కల్లా అందుబాటులో ఉంటాయని రక్షణశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌   వెల్లడించారు.రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి శుక్రవారం లోక్‌సభలో జరిగిన వాడీవేడీ చర్చ కు ధీటుగా సమాధానం ఇచ్చారు.  

 డిఫెన్స్‌ డీలింగ్స్‌కు.. డీలింగ్‌ ఇన్‌ డిఫెన్స్‌కు తేడా ఉందని వ్యాఖ్యానిస్తూ తాము డిఫెన్స్‌ డీలింగ్స్‌ చేయమని చెప్పారు. దేశ భద్రతను, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకునే ఒప్పందాలు చేసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. యుద్ధ విమానాల సంఖ్యను తాము తగ్గించలేదని.. యూపీఏ ఒప్పందం చేసుకున్న 18 విమానాల నుంచి 36 విమానాలకు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే ఎద్దేవా చేశారు. 

 రాఫెల్‌పై కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ ఉద్వేగంగా మాట్లాడారని.. కానీ యూపీఏ ప్రభుత్వ హయాలో అగ్రీమెంట్ ఉన్నా.. ఒప్పందం జరిగినా.. ఎందుకు విమానాలు తీసుకురాలేకపోయారని ఆమె ప్రశ్నించారు. 2016 సెప్టెంబర్ 23న ఒప్పందం జరిగిందని... ఆ నాటి ఒప్పందం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తొలి ఎయిర్ క్రాఫ్ట్ రానుందని చెప్పారు. యూపీఏలాగా తమకు పదేళ్ల కాలం పట్టలేదని.. 14 నెలల కాలంలో ఒప్పందాన్ని పూర్తి చేశామని గుర్తు చేశారు.   

పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లు రక్షణ సంబంధ విషయాల్లో దూకుడుగా ఉంటే, అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేవలం 18 యుద్ధవిమానాలను మాత్రమే కొనుగోలు చేసి, భారత్‌ను ఎటూ కదల్లేని స్థితికి తెచ్చిందని ఆమె ధ్వజమెత్తారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో తగిన సామగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే దీన్ని అత్యవసరంగా గుర్తించామని తెలిపారు.

 2004 నుంచి 2015 వ‌ర‌కు చైనా సుమారు 400 విమానాల‌ను త‌న అమ్ముల‌పొదిలో చేర్చుకుంద‌ని, పాకిస్థాన్ కూడా త‌న వైమానిక ద‌ళాన్ని రెండింత‌లు చేసింద‌ని, ప్ర‌స్తుతం భార‌త్‌లో కేవ‌లం 32 స్క్వాడ్ర‌న్ల బ‌లం మాత్ర‌మే ఉంద‌ని మంత్రి తెలిపారు.   

 ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో నిర్మలా సీతారామన్‌ వారికి గట్టిగానే చురకలంటించారు. తన సమాధానం వినేందుకు కూడా ప్రతిపక్ష సభ్యులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, యుద్ధ విమానాల కొనుగోలు దేశ భద్రతకు సంబంధించిన విషయమని అందరు గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.

కాంగ్రెస్ నేతలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణ మంత్రి  మండిపడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు ఒకటి మాట్లాడితే.. పార్టీ ప్రతినిధి మరొకటి మాట్లాడతున్నారని విమర్శించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలెండ్ భేటీపై కూడా రాహుల్ తప్పుడు సమాచారమిచ్చారని ధ్వజమెత్తారు.   

 ‘ఏ ఏ(అనిల్‌ అంబానీని ఉద్దేశిస్తూ)’ కోసమే యుద్ధ విమానాల కొనుగోలు చేశామని కాంగ్రెస్‌ భావిస్తే, ప్రతి ‘ఏఏ’ వెనుక ఒక ‘క్యూ(ఖత్రోకీని ఉద్దేశిస్తూ)’, ‘ఆర్‌వి(రాబర్ట్‌ వాద్రాను ఉద్దేశిస్తూ)’ ఉన్నారంటూ నిర్మలా సీతారామన్‌ ఎదురు దాడికి దిగారు.

‘రఫేల్‌ మీ హక్కు. దాన్ని మీరే తయారు చేయాలి’ అని బెంగళూరు హెచ్‌యూఎల్‌ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. హెచ్‌ఏఎల్‌కు ఎందుకు ఇవ్వలేదో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలని, హెచ్‌ఏఎల్‌ గొప్పలే కాదు, లోపాలనూ గుర్తించాలని సూచించారు. 

 తేజస్‌ విషయంలో హెచ్‌ఏఎల్‌ వేగంగా పనిచేయలేదని ఆమె చెప్పారు. హెచ్‌ఏఎల్‌ విషయంలో కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. తాము హెచ్‌యూఎల్‌కు రూ.లక్ష కోట్ల ఒప్పందాలు అప్పగించామని ఆమె వెల్లడించారు.