చంద్రబాబుకు మోదీ భయం పట్టుకుంది

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రధాని నరేంద్ర మోదీ భయం పట్టుకుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ హరిబాబుతో కలిసి ఆయన ఢిల్లీలో మీడియాతో టీడీపీ ఎంపీలు డ్రామా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. యూసీలు అడిగితే తామేమన్న గుమస్తాలమా అంటున్న టీడీపీ నేతలకు ప్రభుత్వ అధికారులంటే అంత చులకనగా కనబడుతున్నారా అని ప్రశ్నించారు. 

టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని నట్టేటా ముంచిందని ఎద్దేవా చేశారు. 600 హామీలు ఇచ్చిన టీడీపీ వాటిని అమలు చేయకుండా డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇస్తున్న చంద్రబాబు కేంద్రాన్ని నిందిస్తూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. కూర్చున్న కొమ్మనే నరుక్కునే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ప్రచార ఆర్భాటం కోసం చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జివిఎల్  ఆరోపించారు. హైకోర్టు నిర్మాణానికి 8 నెలల సమయం ఇచ్చినా టీడీపీ ప్రభుత్వం కట్టలేకపోయిందని.. అలాంటి వారు ప్రపంచంలోనే 4వ పెద్ద రాజధాని నిర్మిస్తామంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడుని తిడుతున్నారో, పొగుడుతున్నారో ఆ పార్టీ నేతలనే అడగాలని ఎద్దేవా చేశారు.  

హరిబాబు మాట్లాడుతూ.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. 2018-19 ఏడాదికి గానూ రూ 6243 కోట్ల  నరేగా నిధులు విడుదలయ్యాయని తెలిపారు. గతేడాది కంటే ఈ సారి వెయ్యి కోట్లు అదనంగా నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం చేస్తున్న సహాయాన్ని టీడీపీ చిన్నదిగా చూపే ప్రయత్నం చేయడం మంచింది కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ది నక్క తోక కాదని.. అది కుక్క తోక మాత్రమేనని వ్యాఖ్యానించారు.