కాంగ్రెస్ విధానాలతోనే కాశ్మీర్ లో ఉగ్రవాదం

గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన తప్పుడు విధానాల మూలంగానే కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగిపోయిందని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై రాజ్యసభలో గురువారం జరిగిన చర్చల్లో పాల్గొంటూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. 

జమ్ముకశ్మీర్‌లో గత నాలుగున్నర ఏళ్లలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన ఆరోపణలు సత్యదూరమని ఖండించారు. 1948 నుండి కాంగ్రెస్ అనుసరించిన విధానాల మూలంగానే కశ్మీర్‌లో పరిస్థితి చెడిపోయిందంటూ కాంగ్రెస్ చేసిన తప్పులను లెక్కించారు. కశ్మీర్‌కు చెందిన మూడోవంతు భాగం మన శత్రువువద్ద ఉన్నది.. దీనికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. 

సైనికులను పంపించడంలో ఆలస్యం చేయటం, తప్పుడు సమయంలో కాల్పుల విరమణ ప్రకటించటం వల్లే కశ్మీర్‌కు చెందిన మూడవ వంతు భాగం వారి ఆధీనంలోకి వెళ్లిపోయిందని అరుణ్ జైట్లీ చారిత్మ్రాక అంశాలను సభకు వివరించారు. భారత సైనికులు ముందుకెళ్లి పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్న సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి దేశానికి అన్యాయం చేసిందని అరుణ్ జైట్లీ దుయ్యబట్టారు. ఉగ్రవాదానికి అప్పుడే పునాది పడిందని ఆయన దుయ్యబట్టారు. 

కశ్మీర్‌కు వేరే అస్తిత్వం కల్పించింది కాంగ్రెస్ వారు కాదా అని ఆయన నిలదీశారు. 1952లో షేక్ అబ్దుల్లాను అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేసిందని ఆయన ప్రశ్నించారు. ప్లబిసేట్ ఫ్రంట్ పెట్టింది కాంగ్రెస్ కాదా? అని జైట్లీ ప్రశ్నించారు. 1957, 1962, 1967లో జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు ఎలా జరిగాయనేది ప్రపంచానికి తెలుసు.. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమకు గుణపాఠాలు చెప్పటం ఏమిటని ఆయన నిలదీశారు. 

జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ కశ్మీర్ పోలీసుల కస్టడీలో ఎలా మరణించారని ఆయన గులాం నబీ ఆజాద్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను చరిత్ర ఎప్పటికీ క్షమించదని జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్ నవ్వులపాలు చేసింది.. అప్పట్లో నిర్వహించిన ఫార్స్ ఎన్నికల మూలంగానే ప్రజల్లో వేర్పాటువాదం వేళ్లూనకున్నదనిఆరోపించారు.

 మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా కశ్మీర్‌లో 1977లో జరిపిన ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి జీఎం షా పాలనలో 1989 వరకు కశ్మీర్ దేశానికి దూరమైందిని, ప్రజలూ దూరమయ్యారనిజైట్లీ మండిపడ్డారు. షా పాలనలో కేంద్ర ప్రభుత్వం కార్యాలయాన్ని ఏర్పాటు చేయనివ్వలేదని, భారతదేశం అనే పదాన్ని తొలగించారని అరుణ్ జైట్లీ చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ఇప్పుడు కొనసాగుతున్న పోరాటం ప్రజలకు వ్యతిరేకం కాదు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొనసాగుతోందని జైట్లీ వివరించారు.