శాస్త్ర పరిశోధనలకు జై అనుసంధాన్ .. మోదీ పిలుపు

కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చి ప్రోత్సహించడానికి అవసరమయ్యే కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు `జై అనుసంధాన్' నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు. జలంధర్ లో  106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలో మోదీ  ప్రారంభోత్సవ ప్రసంగం చేస్తూ ఇప్పటి వరకు దేశంలో ఉన్న ఉన్న జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదానికి ఇప్పుడు జై అనుసంధాన్ జోడిస్తున్నట్లు ప్రకటించారు. 

దివంగత మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి ప్రవేశపెట్టిన జై జవాన్, జై కిసాన్ నినాదం దేశవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది. తర్వాత ప్రధాని వాజపేయి హయాంలో దానికి జై విజ్ఞాన్ నినాదాన్ని కలిపారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ `జై అనుసంధాన్' ను ఆ నినాదానికి జోడించారు. వివిధ పరిశోధనలకు జాతీయ ప్రయోగశాలలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషనల్ రీసెర్చి లాంటి సంస్థలు వెనె్నముకలా ఉన్నాయని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. 

దేశంలోని 95 శాతం విద్యార్థులు స్టేట్ యూనివర్సిటీలు, కాలేజీల్లోనే చదువుతున్నారని, అయితే వీటిలో పరిశోధనలకు సంబంధించి ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. దీని నిమిత్తం  సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ కౌన్సిల్‌తో చర్చలు జరిపామని చెబుతూ మానవ వనరుల అభివృద్ధి శాఖ సమన్వయంతో దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కోరినట్టు ఆయన వెల్లడించారు. 

ముఖ్యంగా కళాశాలలు, స్టేట్ యూనివర్సిటీల్లో పరిశోధనలు మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో తాము చేపట్టనున్న ఈ కార్యక్రమానికి తమ సైన్స్, టెక్నాలజీ కౌన్సిల్ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టి సంబంధిత మంత్రులు, శాఖలు, మేధావులతో చర్చలు జరుపుతోందని ప్రధాని తెలిపారు. ఇప్పుడు దేశం నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌ల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తించిన తమ ప్రభుత్వం గత 40ఏళ్లుగా గత ప్రభుత్వాలు సాధించలేని ప్రగతిని అత్యుత్తమ సాంకేతికతో కూడిన సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా సాధించామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా  పేర్కొన్నారు. 

అందుకే ఇప్పుడు దేశం కొత్త నినాదం జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధానం అని ఆయన ప్రకటించారు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా జై అనుసంధానం నినాదాన్ని కలిపినట్టు ఆయన తెలిపారు. మన పూర్వికుల మేధస్సు అపూర్వమైనదని, అప్పట్లో వారు చేసిన పరిశోధనలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని, లెక్కలు, సైన్స్, సంస్కృతి, కళలు ఇలా విభ్నిన రంగాల్లో అప్పట్లోనే వారు ఎంతో ప్రతిభను చూపారని మోదీ గుర్తు చేశారు. తిరిగి అలాంటి ప్రతిభాపాటవాలను చూపే సమయం భారత్‌కు వచ్చిందని, అందుకే అలాంటి ప్రపంచాన్ని సృష్టించదల్చామని పేర్కొన్నారు. 

దీనికి మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఒకే దిశలో పనిచేసి పరిశోధనలు, నూతనత్వంలో ప్రపంచానికి మన గొప్పదనాన్ని చాటి చెప్పాలని ఆయన కోరారు. బిగ్ డాటా అనలిటిక్స్, ఆర్ట్ఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్-చెయిన్ టెక్నాలజీలను వ్యవసాయానికి అనుసంధానం చేసి విస్తృతంగా వినియోగించాలని, దీనివల్ల రైతులకు ముఖ్యంగా చిన్నకమతాలు ఉన్న రైతులకు ఎంతో మేలు జరగాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రజల జీవన విధానం మరింత సులువుగా సాగేలా మనశాస్తవ్రేత్తలు పరిశోధనలు చేసి ఎప్పటికప్పుడు నూతన వస్తువులను ఆవిష్కరించాలని ఆయన సూచించారు.

 ఇప్పుడు భవిష్యత్‌లోని అన్ని అంశాలు సాంకేతికత అంశాలతో ముడిపడి ఉన్నాయని, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, ఆర్ట్స్, ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో మనం అభివృద్ధి సాధించాలంటే సాంకేతికతను అనుసంధానం చేసుకోవాలని, దానికి పరిశోధనలు ఒక్కటే మార్గమని ఆయన ఉద్ఘాటించారు. 2018 సైన్స్ ఆవిష్కరణల పరంగా భారత్ ఎంతో ప్రగతిని సాధించిందని పేర్కొంటూ ఏవియేషన్ గ్రేడ్ బయోఫ్యూయల్, దృష్టి లోపం ఉన్న వారికి దివ్యనాయన్ కనిపెట్టిన పరికరం, ఎక్కువగా ఖర్చు లేకుండా కేన్సర్‌ను నిర్ధారించే పరికరం, అలాగే డెంగూ, టీబీల గురించి ముందే హెచ్చరించే పరికరం ఇలా ఎన్నో నూతన ఆవిష్కరణలు భారత్‌ను ప్రగతిమార్గాన తీసుకువెళ్లేవేనని ప్రధాని మోదీ వివరించారు.